Road Accident in Huzurabd: కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. నిలిపి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొని ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణిని మరోసారి ఎత్తిచూపుతోంది.
హుజురాబాద్‌లోని కాకతీయ కాలనీ నివాసి అయిన వేములవాడ అక్షయ్ సాయి (18) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తన స్నేహితుడిని తీసుకురావడానికి బైక్‌పై హుజురాబాద్ నుంచి రంగాపూర్ గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. పట్టణంలోని గెలాక్సీ సూపర్ మార్కెట్ ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది డివైడర్లలో మట్టి పోసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ పని నిమిత్తం మట్టి నిండిన ట్రాక్టర్‌ను ముఖ్య రహదారిపై నిలిపి ఉంచారు. అదే సమయంలో అటుగా వచ్చిన అక్షయ్ సాయి.. మున్సిపల్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అతడి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం… ప్రమాదం జరిగిన సమయంలో ఉదయం పూట ఆ ప్రాంతమంతా మంచుతో నిండి ఉండటం వల్ల బైక్ పై వేగంగా వస్తున్న అక్షయ్ సాయి, ముందున్న ట్రాక్టర్‌ను సమీపానికి వచ్చేవరకు గమనించలేకపోయాడు. ట్రాక్టర్‌ను ఆపిన సిబ్బంది, ఇతర వాహనదారులను అప్రమత్తం చేయడానికి ఎలాంటి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ టేపులు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన సంభవించింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు యువకుడిని హుటాహుటిన పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అక్షయ్ సాయి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వార్త విని మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం:
ఉదయం వేళ, మంచుతో రోడ్డు కనపడనప్పుడు కూడా మున్సిపల్ సిబ్బంది ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడటంపై మృతుడి బంధువులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌ను ఆపేటప్పుడు కనీస నిబంధనలు కూడా పాటించని అధికారుల నిర్లక్ష్యమే తమ బిడ్డను బలిగొందని వారు ఆరోపించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపిన విషయంపై, అలాగే భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన సంబంధిత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రోడ్డు భద్రత అంశాలను పర్యవేక్షించడంలో మున్సిపల్ యంత్రాంగం వైఫల్యంపై ఈ సంఘటన తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ విషయంలో అధికారుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.


