Delhi Car Blast Case updates: ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థలు కీలక పురోగతి సాధించాయి. ఈ కేసులో మొత్తం 15 మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఒక సుశిక్షితులైన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఈ దర్యాప్తులో ఛేదించడం గమనార్హం.
ఢిల్లీ పేలుడుకు గంటల ముందు, జమ్ముకశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు, ఇతర కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టు అయిన 15 మందిలో కశ్మీర్ లోయ నుండి ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ నుండి ఒకరు, హర్యానాలోని ఫరీదాబాద్ నుండి ఇద్దరు ఉన్నారు. మిగిలిన అరెస్టులు ఇతర రాష్ట్రాల్లో జరిగాయి.
కీలక నిందితులు డాక్టర్లే:
అరెస్టు అయిన వారిలో కొంతమంది డాక్టర్లు, వైద్య నిపుణులు ఉండడం ఈ కేసులో అత్యంత ముఖ్యమైన అంశం. వీరంతా ‘వైట్-కాలర్’ ఉగ్రవాద మాడ్యూల్‌లో భాగంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అరెస్టు అయిన డాక్టర్లలో పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయీ, ఖాజీగుండ్‌కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్, లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ సయీద్ వంటి వారు ఉన్నారు. వీరితో పాటు ఆరిఫ్ నిసార్ దార్, యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్, మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వంటి వారిని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం.
ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం:
అరెస్టులకు ముందు, హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ముజమ్మిల్ గనాయీ అద్దెకు తీసుకున్న నివాసం నుంచి 360 కేజీల అమ్మోనియం నైట్రేట్‌తో సహా దాదాపు 2,900 కేజీల ఐఈడీల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, ఆయుధాలు సీజ్ చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ పేలుడు పదార్థాలు ఢిల్లీ పేలుడుతో ముడిపడి ఉన్నాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
ప్రధాన అనుమానితుడు:
పేలుడు జరిగిన హ్యుండాయ్ ఐ20 కారును నడిపినట్లు భావిస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఉమర్ అనే వ్యక్తి ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు. ఇతను పుల్వామాకు చెందిన డాక్టర్. పేలుడుకు కొద్ది గంటల ముందు తన సహచరులు అరెస్ట్ కావడంతో, తాను కూడా దొరికిపోతాననే భయంతో పేలుడుకు పాల్పడి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో ఉమర్ మరణించి ఉంటాడని, కారులో దొరికిన శరీర భాగాలను.. అధికారులు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ధృవీకరించే పనిలో ఉన్నారు.


