Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుDrugs gang: హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్.. ఆయుధాలు సీజ్

Drugs gang: హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్.. ఆయుధాలు సీజ్

Drugs gang arrested in Hyderabad: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరా వ్యవహారంపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోస్తోంది. అయినా డ్రగ్స్ గ్యాంగులు రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో, బుధవారం (జూలై 23) మరోసారి నార్కోటిక్స్ విభాగం భారీ స్థాయిలో దాడులు నిర్వహించి డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 మంది డ్రగ్స్ సరఫరాదారులు పోలీసుల బలానికి చిక్కారు. అరెస్టు చేసిన వారిలో ఆరుగురు కొకైన్ సరఫరాదారులు కాగా, మరో ముగ్గురు ‘మియావ్ మియావ్’ (మెఫెడ్రోన్) అనే ఎమ్డీ డ్రగ్ విక్రయదారులు ఉన్నారు. వారి వద్ద నుంచి 286 గ్రాముల కొకైన్, 11 ఎక్స్టసీ టాబ్లెట్లు, 12 మొబైల్స్, ఒక దేశీ తుపాకీ, ఆరు తుపాకీ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక, డ్రగ్ ట్రాఫికింగ్‌లో భాగస్వాములుగా ఉన్న ఇద్దరు విదేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని త్వరలోనే విదేశాలకు డిపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

మూడు ముఠాల పట్టివేత: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, డ్రగ్స్ దందాలో మూడు ప్రధాన ముఠాలను గుర్తించామని తెలిపారు. మొత్తం తొమ్మిది మంది డ్రగ్ పెడ్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ ముఠాలు ముంబయి, రాజస్థాన్, గోవాలతో సంబంధాలున్నట్లు పేర్కొన్నారు.

ముఠా 1: ప్రేమ్ ఉపాధ్యాయ్ నాయికత్వంలోని కొకైన్ గ్యాంగ్

ఈ గ్యాంగ్‌ను నల్లకుంట, శేరిలింగంపల్లిలో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ప్రేమ్ ఉపాధ్యాయ్ 2022 నుంచి డ్రగ్స్ వాడుతున్నాడు. ముంబయికి చెందిన ముజాయిత్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు. ముజాయిత్ నైజీరియన్‌ల నుంచి కొకైన్ కొని, సముద్ర మార్గం ద్వారా దేశంలోకి తీసుకొస్తున్నాడు. ప్రేమ్ వద్ద నుంచి 276 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ దాదాపు ₹69 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

ముఠా 2: మెఫెడ్రిన్ సరఫరా గ్యాంగ్

ఈ ముఠాలో పవన్ భాటి, హేమ్ సింగ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కాటేదాన్‌కు చెందిన జితేందర్ అనే వ్యక్తి డ్రగ్స్ విక్రయానికి ఆయుధాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. అతడు ఒక దేశీ తుపాకీ మరియు లైవ్ బుల్లెట్లు కొనుగోలు చేసి తోట వద్ద ఫైరింగ్ కూడా చేశాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ముఠా 3: హర్ష అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్యాంగ్

బీటెక్ చదివిన హర్ష అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ మోసంతో మానసికంగా కుంగిపోయి డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. గోవాకు చెందిన క్రిస్ అనే డ్రగ్ పెడ్లర్‌తో పరిచయం ఏర్పడి, మొదట వినియోగదారుగా ఉన్న హర్ష, తరువాత విక్రేతగా మారాడు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల కొకైన్, 1 ఎక్స్టసీ పిల్ స్వాధీనం చేసుకున్నారు.

విదేశీయుల అరెస్ట్ – డిపోర్టేషన్ ప్రక్రియ

ఇద్దరు నైజీరియన్‌లు, వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిని త్వరలో వారివారి దేశాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డిపోర్ట్ చేయడం కొంత కష్టమైన ప్రక్రియ అయినా, నిబంధనల మేరకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్స్, FRRO అనుమతులు తీసుకుని, టికెట్ బుక్ చేసి పంపించాల్సి ఉంటుంది. గత మూడు సంవత్సరాల్లో 33 మంది విదేశీయులను అరెస్ట్ చేసి, 19 మందిని ఇప్పటికే డిపోర్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతూ, వాటిని ధ్వంసం చేయడంలో కీలకమైన అడుగులు వేస్తున్నారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ, యువతను మాదకద్రవ్యాల ప్రమాదం నుంచి రక్షించేందుకు ప్రభుత్వం, పోలీసు విభాగం చర్యలు కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad