Engineering Student Raped In Kolkata, Classmate Arrested: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మరో దారుణం జరిగింది. నగరంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న రెండో సంవత్సరం విద్యార్థినిపై ఆమె క్లాస్‌మేట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆనంద్‌పూర్ ప్రాంతంలో తలదాచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
చదువు నిమిత్తం వేరే రాష్ట్రం నుంచి కోల్‌కతాకు వచ్చిన ఆ యువతి, తన క్లాస్‌మేట్‌పై ఆనంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను నిందితుడు ఇచ్చిన పానీయం తాగిన తర్వాత మత్తులోకి జారిపోయానని, ఆ తర్వాత నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఏ రాష్ట్రానికి చెందినది అనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, “బాధితురాలు ఆనంద్‌పూర్‌లోని ఒక అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోంది. నిందితుడు ఆ ఫ్లాట్‌కు వచ్చి, ఆమె పానీయంలో మత్తు పదార్థాలను కలిపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ పానీయం తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోగా, అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు.”
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒక మెడికల్ కళాశాల విద్యార్థిని క్యాంపస్ వెలుపల సామూహిక అత్యాచారానికి గురైందనే వార్త వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో మహిళా భద్రతపై ఆందోళన పెంచుతోంది.
ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లగా, ఆనంద్‌పూర్‌లోని తన ఇంటికి తిరిగి రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి అక్టోబర్ 22 వరకు పోలీస్ కస్టడీ విధించారు. కేసు దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.


