Hyderabad engineering student suicide : కన్నవారికి కడతేరని శోకాన్ని మిగిల్చి, చదువుల కోవెలలో ఓ యువ ఇంజనీర్ ఆశలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సీనియర్ల పైశాచిక ఆనందం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న వేళ, అసలు ఆ రోజు హాస్టల్ గదిలో ఏం జరిగింది..? ఆ యువకుడి మరణం వెనుక దాగి ఉన్న అసలు నిజాలేంటి..?
హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నారపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తాళలేక, తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థి తనువు చాలించాడు. పోలీసుల కథనం ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయితేజ (19) నారపల్లిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువు నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ బాలుర హాస్టల్‌లో నివాసం ఉంటున్నాడు.
ఇటీవల కళాశాలలో సాయితేజకు, కొందరు సీనియర్ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం సీనియర్లు సాయితేజను తీవ్రంగా వేధించినట్లు తెలుస్తోంది. బలవంతంగా బార్‌కు తీసుకెళ్లి, మద్యం తాగించి, సుమారు రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు అయిన బిల్లును అతడినే చెల్లించాలని తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో వారు సాయితేజపై దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ అవమానాన్ని, వేధింపులను భరించలేని సాయితేజ, తీవ్రవేదనకు గురై హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇది ఆత్మహత్య కాదు, హత్యే: తండ్రి ఆవేదన : అయితే, ఇది ఆత్మహత్య కాదని, తన కుమారుడిని సీనియర్లే హత్య చేశారని మృతుడి తండ్రి ప్రేమ్ సింగ్ ఆరోపిస్తున్నారు. “మా బాబును నాల్గవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేశారు, డబ్బుల కోసం తీవ్రంగా కొట్టారు. చనిపోయే ముందు ఓ వీడియో పంపాడు, అందులో తనను కొడుతున్నారని, డబ్బులు అడుగుతున్నారని చెప్పాడు,” అని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు వచ్చే వరకు మృతదేహాన్ని కిందికి దించరని, కానీ ఇక్కడ తమ కుమారుడి మృతదేహాన్ని ముందే పక్కకు తీశారని, ఇది హత్యేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి చావుకు కారణమైన నలుగురు సీనియర్లను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్‌కు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ దారుణ ఘటన విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం ఏ స్థాయిలో వేళ్లూనుకుపోయిందో మరోసారి కళ్లకు కడుతోంది.


