మరి కొద్ది గంటల్లో గమ్యాన్ని చేరుకోవాల్సిన 48 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దక్షిణ మెక్సికో (Mexico)లో జరిగింది. బస్సును ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి ప్రయాణీకులు సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు.
టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. ట్రక్కు ఒక్కసారిగా ఢీ కొనటంతో బస్సులో మంటలు వ్యాపించాయి. బస్సు లోపల 38 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లూ కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇంకా ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.