గుంటూరు జిల్లా స్వర్ణభారతి నగర్‌లో దారుణం జరిగింది. వీధికుక్క దాడి(Dogs Attack)లో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చర్చి నుంచి బయటకు వచ్చిన ఐజాక్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి.
మెడను కొరికేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పిల్లాడి అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు చనిపోయాడు. చిన్నారి మృతితో స్వర్ణభారతి నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాలు ఇలా ఉన్నాయి
నాగరాజు, రాణి మెర్సి దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఐజక్ మూడో సంతానం. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు ఐజాక్ ను ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లగా మధ్యలో పాస్ వస్తున్నాయని బాలుడు బయటకు వచ్చాడు.. అక్కడ ఉన్న ఓ కుక్క ఐజాక్ పై దాడిచేసింది. బాలుడి మెడ పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లగా ఇరుగు పొరుగువారు చూసి వెంబడించడంతో వదిలి పెట్టింది. శునకం దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
ఇప్పటికే వీధి కుక్కల పున:రుత్పత్తి లేకుండా గత జూన్ నుంచి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు గుంటూరు మున్సిపల్ అధికారులు. ఈమధ్య కాలంలో డాగ్ లవర్స్ పేరుతో కొంతమంది జంతు ప్రేమికుల ముసుగులో బాధ్యతారహింగా వ్యవహరిస్తున్నారని.. గుంటూరు మున్సిపాలిటీ చేపట్టే డ్రైవ్‌కి ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్తున్నారు అధికారులు. తమ సిబ్బందిపై కూడా దాడులు చేస్తున్నారని దీనిపై ఇప్పటికే కేసులు పెట్టామని చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్‌లెన్స్ ప్రకారం కుక్కల విషయంలో నడుచుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు.