Interstate narcotics smuggling ring : పైన చూస్తే ఘుమఘుమలాడే జీడిపప్పు బస్తాలు.. లోపల చూస్తే లక్షలాది జీవితాలను నాశనం చేసే గంజాయి ఘాటు! ‘పుష్ప’ సినిమాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించిన తీరును తలదన్నేలా, ఓ అంతర్రాష్ట్ర ముఠా పన్నిన వ్యూహం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. ఒడిశా అడవుల నుంచి మహారాష్ట్ర మార్కెట్లకు గంజాయిని తరలించేందుకు వీరు ఎంచుకున్న మార్గం వినూత్నంగా ఉన్నా, చట్టం కన్నుగప్పి తప్పించుకోలేకపోయారు.
పక్కా ప్రణాళికతో భారీ దందా : ఈ గంజాయి రవాణా వెనుక ఓ పెద్ద అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉంది. ఒడిశాలోని మల్కన్‌గిరి మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయిని సేకరించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు తరలించడం వీరి ప్రణాళిక. ఈ కేసులో మహ్మద్ కలీముద్దీన్, షేక్ సోహైల్, మహ్మద్ అఫ్జల్ అనే ముగ్గురు కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్ననాటి స్నేహితులైన వీరు, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ చీకటి మార్గాన్ని ఎంచుకున్నారు.
“ఒడిశాకు చెందిన జిత్తు, ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన సురేష్ ఈ ముఠాకు ప్రధాన సరఫరాదారులు. హైదరాబాద్‌కు చెందిన రెహమాన్ (అరెస్టైన కలీముద్దీన్ సోదరుడు), ఈ గంజాయిని మహారాష్ట్రలోని మహేష్ అనే వ్యక్తికి చేరవేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రతీ లోడ్‌కు రూ.3 నుంచి రూ.5 లక్షలు సంపాదించడమే వీరి లక్ష్యం” అని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ మీడియాకు వెల్లడించారు.
జీడిపప్పు ముసుగులో : పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నిందితులు పక్కా ప్రణాళిక రచించారు. గంజాయి రవాణా కోసమే ప్రత్యేకంగా ఓ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఒడిశా నుంచి భారీ మొత్తంలో గంజాయిని వాహనంలో నింపి, దానిపై ఎవరికీ అనుమానం రాకుండా జీడిపప్పు బస్తాలను పేర్చారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ఎదురైనా, తాము జీడిపప్పు వ్యాపారులమని చెప్పి కళ్లుగప్పాలని ప్రయత్నించారు. ఒడిశాలో బయలుదేరిన ఈ ముఠా, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు పయనమవుతుండగా పోలీసులకు చిక్కారు.
వలపన్ని పట్టుకున్న పోలీసులు : నిందితులు అనుసరించిన పద్ధతి పోలీసులను ఆశ్చర్యపరిచినా, పక్కా సమాచారంతో నిఘా పెట్టిన ప్రత్యేక బృందాలు వారి ఆట కట్టించాయి. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా జీడిపప్పు బస్తాల కింద దాచిన సుమారు రూ.2.70 కోట్ల విలువైన గంజాయి బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన రెహమాన్ (హైదరాబాద్), జిత్తు (ఒడిశా), సురేష్ (శ్రీకాకుళం), మహేశ్ (మహారాష్ట్ర) పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సిండికేట్‌లోని మిగతా సభ్యులను, సరఫరా గొలుసును గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.


