నిత్యం పాఠాలు మంత్రాల్లా వినిపించే అపురూపమైన చోటు అపవిత్రమవుతోంది. మహాయాగంలా బోధనలు సాగే స్థలం సిగ్గుతో తల దించుకుంటోంది. సభ్యసమాజాన్ని నిర్మించే కళాశాల లో ‘కొందరు’ చేసిన పని చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటోంది. గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం మందుబాబులకు అడ్డాగా మారింది. రోజూ సాయంత్రం వేళల్లో మందుబాబులు కాలేజీ ఆవరణంలోకి వచ్చి మద్యం సేవించి సీసాలు, చెత్తను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు క్రీడలు ఆడుకునేందుకు నెలువైన మైదానంలో ఉన్న తాగి పడేసిన ఖాళీ సీసాలు, సిగిరెట్ ముక్కలు, గుట్కా కవర్లతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో ఈ కళాశాలకు ఎదుట గేటు చుట్టూరా ప్రహరీ గోడ లేక పశువులు పందులు మేకలు సంచారంతో పాటుగా ఈ క్రీడా మైదానాన్ని మందుబాబులు సాయంత్రం వేళల్లో మద్యం సేవించేందుకు కాలేజీని ఇలా అవసరాలకు వినియోగిస్తున్నారు. తాగి పడేసిన మద్యం సీసాలను అక్కడే పగులగొట్టి వేస్తుండటంతో కాలేజీకి వస్తున్న విద్యార్థులు చదువుల తల్లి కాలేజీ పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం గేటును ఏర్పాటు చేసినప్పటికీ కళాశాల అనే స్పృహ లేకుండా కళాశాల ఆవరణంలోనే తాగుతూ సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న వీరి తంతు మారడం లేదు.
మద్యం దుకాణాలకు అనుబంధంగా మద్యం సేవించేందుకు ఒకప్పుడు షెడ్లు ఉండేవి. మందుబాబులు దుకాణాల్లో కొనుగోలు చేసుకుని పక్కన ఉన్న షెడ్లలో మద్యం సేవించేవారు. ప్రస్తుతం దుకాణాల్లో మద్యం సేవించేందుకు ఎటువంటి సదుపాయం లేదు. దీంతో సాయంత్రమైతే చాలు మండల కేంద్రానికి చెందిన మందుబాబులు మద్యం కొనుగోలు చేసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మైదానం వద్దకు వస్తూ. మద్యం సేవించి సీసాలు, కంపుగొట్టే ప్లాస్టిక్ కవర్ల వ్యర్థాలను కళాశాల ఆవరణంలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. కొంత మంది ఆకతాయిలు సీసాలను పగులగొట్టేస్తున్నారు. మరికొంత మంది మద్యం మత్తులో మందుబాబులు కళాశాల గదులలోని కిటికీలను తలుపులను పలగొడుతూ తీవ్ర నష్టం కలిగిస్తున్నారు నిత్యం ఇదే తంతుగా కొనసాగిస్తూ కళాశాలలో మద్యం సేవిస్తున్న మందు బాబులా ఆట కట్టించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఉదయం కళాశాలకు రాగానే కళాశాలలోని అధ్యాపకులు విద్యార్థులు శ్రమదానంతో సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నప్పటికీ మరుసటి రోజుకి యథావిధిగా చెత్త పేరుకుపోతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకు కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ప్రహరీ గోడ నిర్మించే వరకు మందుబాబులను నియంత్రించేందుకు పోలీసులు గట్టి నిఘా వేసి కళాశాలలో మద్యం సేవిస్తున్న మందుబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల అధ్యాపకులు విద్యార్థులు కోరుతున్నారు.