Thousands of Fish Die in Edulabad Lake: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, ఎదులాబాద్ లోని లక్ష్మీనారాయణ చెరువులో విషపూరిత కలుషిత వ్యర్థాలు కలవడంతో పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. 700 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువులోని నీరు కాలుష్యానికి గురికావడంతో చేపలు చనిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి వచ్చే విషపూరిత రసాయన వ్యర్థ జలాలే ఈ దుర్ఘటనకు కారణమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో కాలుష్య నీరు చెరువులోకి ప్రవేశించి చేపల ప్రాణాలను తీస్తున్నాయని వాపోతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి చెరువులో పెంచుకున్న చేపలు ఒక్కసారిగా చనిపోవడంతో మత్స్య కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ చెరువుపై ఆధారపడి సుమారు 700 కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.


