Monday, August 19, 2024
Homeనేరాలు-ఘోరాలుGodavarikhani: యథేచ్ఛగా పేదల బియ్యం అక్రమ రవాణా

Godavarikhani: యథేచ్ఛగా పేదల బియ్యం అక్రమ రవాణా

పట్టించుకోని అధికారులు

పేదలకందాల్సిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీ,అశోక్ నగర్ లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దర్జాగ నడుస్తోంది. అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు అనేక చర్యలు తీసుకున్న రేషన్ మాఫియా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఫలితం లేకుండాపోతోంది. సరైన నిఘా లేకపోవడం, సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ అక్రమ దందా దర్జాగా సాగుతోందనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని బసంత్ నగర్, గోదావరిఖని, రామగుండం, మంథని రేషన్ బియ్యం సేకరించడానికి ఏజెంట్లను నియమించుకొని రూ.10 కి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి అక్కడ రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయించి కాసులు చేసుకుంటున్నారు.

- Advertisement -

సేకరించిన రేషన్ బియ్యాన్ని రాత్రి వేళ్లలో అక్రమ రవాణా ఇబ్బందిగా ఉండటంతో తెల్లవారుజామున  దర్జాగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి  అక్రమ రవాణా కొనసాగుతుందని  బహిరంగానే చర్చించుకోవడం విశేషం. తెల్లవారుజామున పూర్తిగా చెకింగ్ లేకపోవడంతో వీరి అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకపోవడంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. గత కొంతకాలంగా  పట్టపగలే వివిధ వాహనాలలో దర్జాగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండటం విశేషం. అంతేకాకుండా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దళారులను, వ్యాపారులను అదుపులోకి తీసుకుని జరిమానాలతోనే సరిపెడుతున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చినా ఇట్లే బెయిల్‌పై వచ్చి తిరిగి అదే అక్రమ వ్యాపారాన్ని సాగించడంతో రేషన్‌ బియ్యం అక్రమ దందా ఆగడం లేదని సంబంధిత శాఖ అధికారులు వాపోతున్నారు.

దాడులు చేస్తున్నా ఆగని అక్రమ రవాణా

పెద్దపెల్లి జిల్లాలో పోలీసులు దాడులు చేస్తూ అక్రమ రేషన్‌ బియ్యాన్ని అడ్డుకొంటున్నప్పటికీ అక్రమ దందా ఆగడం లేదు. అధికారులు రేషన్‌ బియ్యం అక్రమ సరఫరాపై నిఘా పెడుతూ క్వింటాళ్ల కొద్దీ స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు రామగుండం, గోదావరిఖని, అక్రమ రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పోలీసులు  అక్రమ రేషన్‌ బియ్యం నిఘా పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News