Chevella bus accident tragedy: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అత్యంత హృదయ విదారకమైన అంశం చోటు చేసుకుంది. తాండూరులోని వడ్డెర గల్లీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రమాదంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అక్కా చెల్లెలైన తనుషా, సాయి ప్రియ, నందినీలా జీవిత ప్రయాణం ఈ బస్సు ప్రమాదం ద్వారా అర్థాంతరంగా ముగిసింది. సంఘటన స్థలంలో మృతుల బంధువులు, ప్రయాణికుల ఆర్తనాదాలు అక్కడున్న వారి మనసుల్ని కలచివేశాయి.
ఈరోజు ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న కంకర లారీ ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది. ఈ భయంకరమైన ప్రమాదంలో 24 మందికి పైగా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్‌తో సహా 11 మంది మహిళలు, 10 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
ఈ విషాద ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగం లేదా డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ ఘోర ప్రమాదం మరోసారి నొక్కి చెప్పింది.


