Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: ప్రీతీపై హత్యాయత్నం, నిమ్స్ వద్ద టెన్షన్ టెన్షన్

Hyd: ప్రీతీపై హత్యాయత్నం, నిమ్స్ వద్ద టెన్షన్ టెన్షన్

వరంగల్ కేఎంసీలో ఆత్మహత్యకు యత్నించినట్లుగా పేర్కొంటున్న గిరిజన విద్యార్థిని ప్రీతీ నాయక్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో తన బిడ్డను బ్రతికించుకోవడానికి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ నరేంద్ర తల్లడిల్లుతున్న తీరు చూసిన వారందరికీ కంటతడి పెట్టిస్తోంది. నా బిడ్డ బతికితే చాటు, బిచ్చమెత్తకునైనా పోషించుకుంటానని ఆ తండ్రి చేస్తున్న ఆక్రందన మనసున్న ప్రతిఒక్కరిని చలించిపోయేలా చేస్తోంది. ప్రస్తుతం గిరిజన విద్యార్థినికి నిమ్స్ లో చికిత్స కొనసాగుతోంది. ఈ విషయమై విద్యార్థిని తండ్రి నరేంద్ర మాట్లాడుతూ తన బిడ్డ శరీరం మందులకు సహకరించడం లేదని వైద్యులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తమ చివరి ప్రయత్నం అని వైద్యులు పేర్కొన్నట్లు తెలియజేస్తూ విలపించారు. ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చిన తనకు ఇలాంటి గతి పడుతుందని అనుకోలేదని కన్నీరుమున్నీరు అయ్యారు. తన బిడ్డకు సరైన ట్రీట్మెంట్ అందడం లేదనే అనుమానాలను వ్యక్తం చేశారు.
తన కుమార్తె ఫోన్ తనిఖీ చేస్తే వాస్తవాలు తెలుస్తాయని నరేంద్ర అన్నారు. నవంబర్ నుంచి మైనారిటీ వర్గానికి చెందిన సైఫ్ వేధింపులకు గురి చేస్తున్నా కూడా కళాశాల యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వారి నిర్లక్ష్యపూరిత ధోరణి వల్లే తన బిడ్డకు ఈ గతి పట్టిందన్నారు. వేధింపుల విషయమై వరంగల్ లోని స్థానిక పోలీసు అధికారులు పలుమార్లు ఫోన్ చేసి చెప్పినా వారు సరిగ్గా స్పందించలేదన్నారు. పోలీసుల తీరుతో తన బిడ్డ ప్రాణానికే ముప్పువాటిల్లిందని, వారు ఫిర్యాదుపై సత్వరమే స్పందించి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. తన బిడ్డ ఆత్మహత్యకు యత్నించిందంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు.

- Advertisement -

ఇతర విద్యార్థులను భయాందోళనకు గురి చేసిన కారణంగా ఎవరూ తన బిడ్డకు అండగా నిలవలేదని పేర్కొన్నారు. అదే అదనుగా భావించి సైఫ్ తన బిడ్డకు విషపూరిత రసాయనం ఇచ్చి హత్యకు యత్నించాడనే అనుమానాలను వ్యక్తపరిచారు. ప్రీతీపై జరిగింది కచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ అని అన్నారు. ఘటన జరిగిన తరువాత కూడా కాలేజీ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోందని స్పష్టం చేశారు. మైనారిటీ వర్గానికి చెందిన సైఫ్ ను ఎవరో వెనుక ఉండి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తన బిడ్డ దుస్థితికి కారణమైన హెచ్ఓడీతో పాటు సీనియర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన బిడ్డను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
నిమ్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం..
ప్రీతిని వేధించిన దుండగులను శిక్షించాలనే డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి వద్ద దళిత, గిరిజన విద్యార్థి సంఘాలు, పలు ప్రజా సంఘాలు గురువారం ధర్నాకు దిగాయి. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు రక్షణ లేకుండా పోతోందని సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గాలకు చెందిన వారికి చీమకుట్టినా పరిగెత్తుకుంటూ వెళ్లే ప్రజాప్రతినిధులు, గిరిజనుల విషయంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ద్వంద్వ ప్రమాణాలతో దళిత, గిరిజన, బహుజనులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, వారికి అన్యాయం జరిగితే పట్టించుకోవడం లేదని విమర్శించారు. గిరిజన బిడ్డ ప్రీతికి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News