Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: క్రౌడ్ మానిటరింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై శ్రద్ధ

Hyd: క్రౌడ్ మానిటరింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై శ్రద్ధ

వచ్చే రంజాన్ మాసం, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ సూచించారు. అన్ని పండుగల వేడుకలు సజావుగా ముగిసేలా చూడాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలు, డిఐలు, పెట్రోలింగ్‌ కార్‌, బ్లూ కోల్ట్‌ స్టాఫ్‌ ఆఫీసర్లు, ఉన్నత స్థాయి అధికారులు, కీలక విభాగాలతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భక్తులకు, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మతపరమైన ప్రదేశాలలో క్రౌడ్ మానిటరింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ వహించాలని నొక్కిచెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సత్వరమే ప్రతిస్పందించేందుకు విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాలని తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో ఇతర విభాగాలతో కలిసి సంయుక్త తనిఖీలు కూడా తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.

- Advertisement -

ఎస్‌హెచ్‌ఓలు, డీఐలు పండుగ నెలలో వారి పని వేళలకు మించి విధులు నిర్వహించాలి. సోషల్ మీడియాలో దైవ దూషణ, రెచ్చగొట్టే పోస్ట్‌లను పోస్ట్ చేసే వారితో పాటు నెటిజన్లపై నిఘా ఉంచాలన్నారు. మతపరమైన రౌడీలను, అనుమానితులను సెక్టార్ వారీగా, పోలీసు స్టేషన్ల వారీగా కట్టడి చేయమన్నారు. సమాజానికి సేవ చేయాలనే నిజమైన ఉద్దేశం ఉన్న శాంతి కమిటీలు, బోర్డు సభ్యులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఫిట్ కాప్ గణాంకాలపై సమీక్షిస్తూ పోలీసులు ఆరోగ్యం, ఫిట్ నెస్ పై దృష్టి సారించాలని సూచనలు చేశారు. ఆహారం, వ్యాయామ నియమాలను పాటించాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన డి-కెమో విభాగంతో అన్ని పోలీసు స్టేషన్లు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. వ్యూహాత్మక ప్రాంతాలు, గ్రే పాయింట్లలో కొత్త సీసీటీవీలను బిగించడానికి సహకరించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News