మహిళా పోలీసులు కఠినమైన విధులను కూడా నిర్వహించాలని హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ బిల్డింగులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీసీఎస్, ఎస్బీ, సీఐడీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో మహిళా ఉద్యోగులు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
174 ఏళ్ల సిటీ పోలీస్ చరిత్రలో మధులత తొలి మహిళా ఎస్ ఎచ్ ఓ అని తెలిపారు. గతేడాది ఎనిమిదో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సీఐ బాధ్యతలను తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించామన్నారు. ట్రాఫిక్ లో ధనలక్ష్మి, జ్యోత్స్నలు సీఐలుగా ఉన్నారన్నారు. 2020కు చెందిన మహిళా ఎస్ఐలు డిప్యూటేషన్ పై లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ వంటి విభాగాల్లోకి వచ్చేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని వివరించారు. 18,432 మంది హైదరాబాద్ సిటీ పోలీసు సిబ్బందిలో 11.5శాతం మహిళలే ఉన్నారన్నారు. లింగ అసమానతలను దాటుకుంటూ వారు విధులు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.