Ephedrine drug case in Hyderabad: తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) టీమ్, హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో భారీ డ్రగ్స్ తయారీ యూనిట్ గుట్టును రట్టు చేసింది. జీడిమెట్ల పరిధిలోని స్పింగ్‌ఫీల్డ్ కాలనీలో ఉన్న సాయి దత్తా రెసిడెన్సీలోని ఒక ఫ్లాట్‌లో అక్రమంగా ఎఫిడ్రిన్ (Ephedrine) అనే నిషేధిత డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ. 72 కోట్ల విలువైన 220 కిలోల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కాకినాడకు చెందిన వస్తవాయి శివ రామకృష్ణ పరమ వర్మ (52), పీఎన్‌ఎం లైఫ్ సైన్సెస్ ప్రొడక్షన్ మేనేజర్ దాంగేటి అనిల్ (31), తూర్పు గోదావరికి చెందిన ముసిని దోరబాబు (29), మరియు పీఎన్‌ఎం లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మద్దు వెంకట కృష్ణరావు (45) గా గుర్తించారు. నిందితుల్లో ఒకరైన వస్తవాయి శివ రామకృష్ణ పరమ వర్మకు గతంలో 2017 మరియు 2019లో కూడా డ్రగ్స్ కేసుల్లో నేషనల్ కంట్రోల్ బ్యూరో (NCB) ద్వారా అరెస్టు అయిన చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు పరమ వర్మ, డిసెంబర్ 2024 లో అనిల్‌ను సంప్రదించి, ఐడీఏ బొల్లారంలోని పీఎన్‌ఎం లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీ సౌకర్యాలను ఉపయోగించి ఎఫిడ్రిన్‌ను తయారు చేయాలని ప్రతిపాదించాడు. పరమ వర్మ అందించిన ఫార్ములా ఆధారంగా, అనిల్ ఉత్పత్తి ప్రక్రియను పర్యవేక్షించాడు. ఈ ప్రక్రియలో 220 కిలోల అధిక-నాణ్యత గల ఎఫిడ్రిన్ తయారు చేయబడింది. తయారైన డ్రగ్‌ను జీడిమెట్లలోని వర్మ నివాసంలో నిల్వ చేశారు.
ఎఫిడ్రిన్ అనేది మెథాంఫేటమిన్ వంటి అత్యంత ప్రమాదకరమైన, వ్యసనపరుడైన మాదకద్రవ్యాల అక్రమ తయారీలో ఉపయోగించే ఒక రసాయన పదార్థం. నిందితులు డ్రగ్స్‌ను కొనుగోలు చేసే వారి కోసం జీడిమెట్ల ఫ్లాట్‌లో సమావేశమైన సమయంలో ఈగల్ టీం అధికారులు మెరుపు దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ ముఠాకు చెందిన మరో నిందితుడు ప్రసాద్ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. బొల్లారంలోని ఫ్యాక్టరీలో లీజు పత్రాలు, ఆర్థిక రికార్డులు వంటి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, అక్రమ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు స్పష్టమవుతోందని అధికారులు పేర్కొన్నారు. పారిశ్రామిక యూనిట్లను ఇలా డ్రగ్స్ తయారీకి దుర్వినియోగం చేయడం ప్రజారోగ్యం మరియు భద్రతకు తీవ్ర ముప్పు అని ఈగల్ అధికారులు హెచ్చరించారు.


