Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుKidnap: అంబర్‌పేట్‌ కిడ్నాప్‌ కేసు ఛేదన: రూ.1.5 కోట్లు డిమాండ్‌ చేసిన గ్యాంగ్‌ అరెస్ట్

Kidnap: అంబర్‌పేట్‌ కిడ్నాప్‌ కేసు ఛేదన: రూ.1.5 కోట్లు డిమాండ్‌ చేసిన గ్యాంగ్‌ అరెస్ట్

Amberpet kidnap case: హైదరాబాద్‌, అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన సంచలనం సృష్టించిన కిడ్నాప్‌ కేసును పోలీసులు సమర్థవంతంగా ఛేదించారు. ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి పాలుపంచుకున్న 10 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బాలస్వామి విలేకరులకు తెలిపారు.

- Advertisement -

కిడ్నాప్‌ నేపథ్యం, డిమాండ్:

బాధితుడు మంత్రి శ్యామ్‌ను ఈ గ్యాంగ్ కిడ్నాప్‌ చేసి, విడిచిపెట్టడానికి గాను ఏకంగా రూ.1.5 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి దర్యాప్తులో భాగంగా మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, ఆరుగురు నిందితులు రెంట్‌ కార్లలో వచ్చి శ్యామ్‌ను అపహరించారని గుర్తించారు.

మాజీ భార్య, ఆస్తి వివాదం:

ఈ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు మంత్రి శ్యామ్‌ మాజీ భార్య మాధవీలత కావడం గమనార్హం. మాధవీలత, శ్యామ్‌ అమెరికాలో వివాహం చేసుకుని మూడేళ్లలోనే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా ఆమె శ్యామ్‌కు దూరంగా ఉంది. మరోవైపు, బాధితుడు శ్యామ్‌ తన పేరును ‘అలి’గా మార్చుకొని, ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. శ్యామ్‌కు తన తండ్రి నుంచి సంక్రమించిన రూ.20 కోట్ల విలువైన ఆస్తిని అతను విక్రయించిన నేపథ్యంలో, మాధవీలత ఆస్తిలో వాటా కోసం ఈ కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కిడ్నాప్‌ గ్యాంగ్‌ ప్రధాన సూత్రధారి సాయి అనే వ్యక్తి రామనగర్‌ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో జీ.ప్రీతి అనే లేడీ బౌన్సర్‌గా పనిచేస్తోన్న ఓ మహిళతో పాటు.. ఎల్‌.సరిత అనే మరో మహిళ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించింది. ఆమె ఘటనకు రెండు రోజుల ముందు బాధితుడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే ఉండి, శ్యామ్‌ కదలికలపై పూర్తిగా నిఘా పెట్టినట్లు విచారణలో తేలింది.

నిందితులు బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి, రెండు వేర్వేరు ప్రదేశాల్లో తిప్పుతూ మొదట రూ.30 లక్షలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో, బాధితుడు శ్యామ్‌ తెలివిగా డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి తన స్నేహితుడికి ఫోన్‌ చేయగా, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్యామ్‌ కూడా తెలివిగా తప్పించుకుని పోలీసులకు వివరాలు తెలియజేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. కేసులో మిగిలిన నలుగురు నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad