Hyderabad mother kills twins : కన్నపేగుకు కష్టం వస్తే కన్నీరొస్తుంది.. కానీ ఆ కన్నపేగునే తెంచుకుంటే? నవమాసాలు మోసి, ప్రాణం పోసి, ప్రాణంగా చూసుకోవాల్సిన బిడ్డలనే ఓ తల్లి కడతేర్చింది. రెండేళ్ల ముక్కుపచ్చలారని కవలల ఊపిరి తీసి, ఆపై తానూ తనువు చాలించింది. హైదరాబాద్ బాలానగర్‌లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేని ఆ కుటుంబంలో ఇంతటి పెను విషాదానికి దారితీసిన కారణాలేంటి? బిడ్డల అనారోగ్యమే ఆ తల్లిని అంతలా కలచివేసిందా? లేక తెర వెనుక మరేదైనా కారణం ఉందా?
ఆనందాల హరివిల్లులో విషాద మేఘాలు : ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనిల్‌కుమార్, సాయిలక్ష్మి దంపతులు. ఉపాధిరీత్యా హైదరాబాద్ వచ్చి బాలానగర్‌లోని పద్మనగర్‌లో నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం వారికి కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించడంతో ఆ కుటుంబం ఆనందంతో నిండిపోయింది. ఇటీవల పిల్లల రెండో పుట్టినరోజు వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆర్థికంగా స్థిరపడి, చూడచక్కని పిల్లలతో వారిది ఆదర్శవంతమైన కుటుంబమనే భావించారు. కానీ ఆ నవ్వుల వెనుక తీవ్రమైన మానసిక వేదన దాగి ఉందని ఎవరూ ఊహించలేకపోయారు.
బిడ్డల అనారోగ్యం.. దంపతుల మధ్య కలహం : ఆ దంపతుల విషయంలో బిడ్డల అనారోగ్యం చిచ్చుపెట్టింది. కవల పిల్లల్లో బాబుకు మాటలు సరిగా రాకపోవడంతో స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో సాయిలక్ష్మి తీవ్ర ఆందోళన చెందేది. పాప ఆరోగ్యం కూడా తరచూ దెబ్బతినేది. ఈ క్రమంలో, “ఇలాంటి పిల్లల్ని కన్నావు” అంటూ భర్త అనిల్‌కుమార్ భార్యను వేధించేవాడని, ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భర్త మాటలతో సాయిలక్ష్మి తీవ్రమైన మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు లోనైనట్లు సమాచారం.
ఆ రాత్రి ఏం జరిగింది : ఈ నెల 13న అనిల్‌కుమార్ బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి మరుసటి రోజు వైజాగ్‌లో జరిగే వివాహానికి హాజరు కావాల్సి ఉంది. అయితే, అదే రోజు రాత్రి భార్యాభర్తల మధ్య ఫోన్‌లో మరోసారి వాగ్వాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ప్రవర్తనతో తీవ్ర కలత చెందిన సాయిలక్ష్మి, ఇక తమ బతుకులు ఇంతేనన్న కఠిన నిర్ణయం తీసుకుంది.
కన్నపేగునే చిదిమేసి.. తానూ అంతమై : అక్టోబర్ 14వ తేదీ తెల్లవారుజామున, యావత్ ప్రపంచం నిద్రలో ఉండగా, సాయిలక్ష్మి తన ఇద్దరు కవల పిల్లల గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసింది. అనంతరం తను నివాసం ఉంటున్న భవనం నాలుగో అంతస్తు పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న సాయిలక్ష్మిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, పసిపిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల దర్యాప్తు : సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాయిలక్ష్మి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భర్త అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దంపతుల కాల్ డేటాను విశ్లేషిస్తూ, ఆత్మహత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలను అన్వేషిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమా లేక భర్త వేధింపులే ఈ ఘోరానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.


