Tragedy In Kukatpally: కూకట్‌పల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో పనివాళ్లే యజమానురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. రేణు అగర్వాల్ అనే మహిళను ఆమె ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు యువకులు డబ్బు, నగదు కోసం అతి కిరాతకంగా చంపారు.
ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది. రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు తమ ఇంట్లో పని కోసం జార్ఖండ్‌కు చెందిన హర్ష్ అనే యువకుడిని పెట్టుకున్నారు. హర్ష్‌ను పనిలో చేర్చడానికి రోషన్ అనే మరో యువకుడు సహాయం చేశాడు. రాకేశ్ అగర్వాల్, వారి కుమారుడు దుకాణానికి వెళ్లిన తర్వాత, ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణును నిందితులు డబ్బు, నగల కోసం చిత్రహింసలు పెట్టారు. ఆమె చెప్పకపోవడంతో, కూరగాయల కత్తులతో గొంతు కోసి, తలపై కుక్కర్‌తో బలంగా కొట్టి చంపేశారు.
హత్య చేసిన తర్వాత, వారు ఇంటిలోని లాకర్లను పగలగొట్టి, నగలు, నగదును సూట్‌కేసులో నింపుకొని పారిపోయారు. నిందితులు హత్య తర్వాత రక్తపు మరకలతో ఉన్న దుస్తులను వదిలేసి, స్నానం చేసి కొత్త దుస్తులు ధరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత వారు ఇంటికి తాళం వేసి రాకేశ్ కుటుంబానికి చెందిన స్కూటీపై పారిపోయారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లో నిందితులు ఖాళీ చేతులతో లోపలికి వచ్చి, సూట్‌కేసుతో బయటకు వెళ్లినట్లు రికార్డు అయింది. పోలీసులు నిందితులైన హర్ష్, రోషన్‌ల కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.


