క్రిమిసంహారక మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని బ్లూ కోల్ట్ పోలీసులు కాపాడిన సంఘటన వీణవంక మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… వీణవంక మండలం బేతిగల్ గ్రామ శివారులో పొలాల్లో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని మధ్యాహ్నం సుమారు 2 గంటలకి 100 కు ఫోన్ రాగానే, వెంటనే అప్రమత్తమైన బ్లూ కోల్ట్ పోలీసులు పిసి 971 పి.జయపాల్, హోమ్ గార్డ్ హెచ్ జి 907 కిన్నెర సంపత్ లు 15 నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొని, పురుగుల మందు త్రాగిన వ్యక్తిని పొలాల గట్ల నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంపాటు పోలీస్ అధికారి జయపాల్ తన భుజాల మీద మోసుకొని, బేతిగల్ బస్టాండ్ కి తీసుకు వచ్చారు. అక్కడ అతని వివరాలు అడుగగా మందు తగిన వ్యక్తి కుర్ర సురేష్ తండ్రి మల్లయ్య, 45సం.లు అని తెలుసుకొని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో చిన్న గొడవ జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టుందని చెప్పగా, వెంటనే ఆటోలో చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. సంఘటన వివరాలు తెలుసుకున్న వీణవంక ఎస్సై వంశీకృష్ణ బ్లూ కోల్ట్ పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. సకాలంలో స్పందించడంతో ఒక నిండు ప్రాణం కాపాడే అదృష్టం మీకు దక్కిందని, రిస్క్ తీసుకొని రెండు కిలోమీటర్ల మేర వ్యక్తిని భుజాలపై మోసుకు వచ్చి, ప్రాణాలను కాపాడావని, భవిష్యత్తులో మరిన్ని సాహసోపేతమైన పనులు చేసి సమాజానికి సేవ చేయాలని అన్నారు.