Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుJammikunta: రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాపై టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారుల ఫోకస్

Jammikunta: రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాపై టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారుల ఫోకస్

జమ్మికుంట పట్టణంలోని ఓ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ తిరిగి అదే బియ్యాన్ని సీఎంఆర్ బియ్యం కింద ప్రభుత్వానికి అందిస్తున్నారు అనే ఫిర్యాదు పై టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. పట్టణానికి చెందిన కొండ్ల పాపయ్య తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ కు ఇటీవల రీసైక్లింగ్ బియ్యం దందాపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సదరు మిల్లు యజమాని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి నాలుగు లారీలలో సుమారు 960 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జమ్మికుంటకు పంపించడంతో అనుమానం వచ్చిన సంబంధిత అధికారులు గత నాలుగు రోజులుగా అట్టి లారీలలోని బియ్యాన్ని దిగుమతి చేసుకోలేదు. కొండ్ల పాపయ్య చేసిన ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం సాయంత్రం ఫిర్యాదులో పేర్కొన్న రైస్ మిల్లులో విచారణ చేపట్టారు. టాస్క్ ఫోర్స్ అధికారులు మిల్లులలో విచారణ చేస్తున్నారన్న సమాచారం అందడంతో గిడ్డంగుల సంస్థ వద్ద నాలుగు రోజులుగా నిలిపి ఉంచిన 8 లారీలను అప్పటికప్పుడే జమ్మికుంట కొత్త వ్యవసాయ మార్కెట్ కు తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

- Advertisement -

టాస్క్ ఫోర్స్ అధికారులు గిడ్డంగుల సంస్థ వద్దకు వచ్చేసరికి లారీలు కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయడంతో సదరు లారీలను కొత్త మార్కెట్ వద్ద కు తరలించారని తెలుసుకున్నారు. లారీల వద్దకు వెళ్ళిన టాస్క్ ఫోర్స్ అధికారులు అందులోని బియ్యాన్ని పరిశీలించారు. నాలుగు రోజులుగా గిడ్డంగుల సంస్థ వద్ద నిలువ ఉంచిన లారీల పై టాస్క్ ఫోర్స్ అధికారులు ఎంక్వయిరీ కి వస్తున్నారు అని తెలియడంతో గిడ్డంగుల సంస్థ నుంచి హుటాహుటిన సదరు లారీలను మాయం చేయడంలో పలువురి హస్తం ఉన్నట్లు వినిపిస్తుంది. ఎనిమిది లారీలలోని బియ్యాన్ని కొత్త వ్యవసాయ మార్కెట్ కు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మార్కెట్ గేటు వద్ద విధులలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ సైతం లారీలను మార్కెట్లోకి ఎలా అనుమతించాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై మార్కెట్ అధికారులను వివరణ కోరగా తాము లేని సమయంలో మార్కెట్లోకి లారీలు వచ్చాయని లారీల విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పడం చూస్తుంటే వారు విధుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాపై విజిలెన్స్ అధికారులు సైతం దృష్టి సారించారని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించినందుకు సమాయుత్తం అవుతున్నట్లు పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. లారీలను మాత్రం కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలోనే ఉంచడం జరుగుతుందని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మార్కెట్ అధికారులు తెలిపారు. రీసైక్లింగ్ బియ్యం దందా రోజుకో మలుపు తిరుగుతుండడంతో చివరికి ఏ విధంగా అధికారులు ఈ కథకు ముగింపు పలుకుతారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News