ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుకదా. ఇక్కడ నిత్యం ఏదో ఒక విషయంపై రాద్ధాంతం సాగుతూనే ఉంటుంది. విద్యార్థి రాజకీయాలు, స్టూడెంట్ యూనియన్ గొడవలు, రాజకీయ అంశాలపై ధర్నాలు వంటివి ఇక్కడ చాలా ఎక్కువ. లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఈ యూనివర్సిటీలో ధర్నా చేస్తే ఏకంగా 20,000 ఫైన్ చెల్లించాల్సిందే. అయితే ఇక్కడ ఫుల్ టైం మాత్రమే కాదు, పార్ట్ టైం స్టూడెంట్స్ కు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయని యూనివర్సిటీ తేల్చి చెప్పింది.
హింసాత్మక ఘటనలకు పాల్పడితే 30,000 చెల్లించాల్సందే. 10 పేజీల కొత్త రూల్స్, క్రమశిక్షణా విధానాలపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అన్నీ అమల్లోకి రానున్నాయి. బీబీసీ డాక్యుమెంటరీని మోడీ సర్కారు నిషేధించినా జేఎన్యూలో మాత్రం పదేపదే ప్రదర్శించటంతో వివాదం రాజుకుంది. దీంతో యూనివర్సిటీకి సంబంధించిన అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ఎగ్జిక్యుటివ్ కౌన్సిల్ ఈ తాజా ఆదేశాలు జారీచేసింది.
ఇవి తుగ్లక్ విధానాల్లా ఉన్నాయంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జేఎన్యూ సెక్రెటరీ వికాస్ పటేల్ నిప్పులు చెరిగారు. అడ్డంకులు సృష్టించడం, వివాదాలు సృష్టించడం, పేకాట, హాస్టల్ రూమ్స్ అనుమతి లేకుండా ఆక్రమించుకోవటం, అశ్లీల భాషా వాడకం, దూషించేందుకు దుర్భాషలాడటం, ఫోర్జరీ వంటివి నేరాలుగా యూనివర్సిటీ మొత్తం 17 చర్యలను పేర్కొంది.