Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుCar rental scam : కిరాయి కారుతో.. కిలాడీ దందా!

Car rental scam : కిరాయి కారుతో.. కిలాడీ దందా!

Car rental scam : తక్కువ ధరకే కారు వస్తోందని ఆనందపడ్డారా..? అయితే జాగ్రత్త! మీరు కొన్న కారు కొద్ది రోజులకే మాయమైతే..? మీకు కారు అమ్మిన వారే దొంగల్లా మారి, మీపైనే కేసులు పెడతామని బెదిరిస్తే..? వినడానికి సినిమా కథలా ఉన్న ఈ అసాధారణ మోసానికి పాల్పడుతున్న ఓ ఘరానా ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు ఎలా రట్టు చేశారు..? వారి మోసపు వల ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం.

- Advertisement -

మోసం తీరు : ఈ ముఠా సభ్యులు పక్కా ప్రణాళికతో తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారు. వారి కార్యాచరణ ఐదు అంచెల్లో సాగుతుంది.

అద్దెకు తీసుకోవడం: మొదట, సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అంటూ పలు కంపెనీల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటారు.
నకిలీ సృష్టి: ఆ తర్వాత ఆ కారు అసలు నంబర్ ప్లేట్‌ను తొలగించి, నకిలీ ప్లేట్‌ను అమరుస్తారు. అసలు యజమాని పేరుతో నకిలీ ఆర్.సి, ఆధార్ కార్డులను సృష్టిస్తారు.

అమాయకులే లక్ష్యం: ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో “కారు అమ్మబడును” అని ఆకర్షణీయమైన ధరతో ప్రకటనలు ఇస్తారు. నమ్మకంగా మాట్లాడి, నకిలీ పత్రాలు చూపించి అమాయకులకు లక్షల రూపాయలకు కారును అమ్మేస్తారు.

అసలు కథ ఇక్కడే :  కారును అమ్మే ముందే దానికి రహస్యంగా ఒక జీపీఎస్ ట్రాకర్‌ను అమరుస్తారు. కారు ఎక్కడుందో ఎప్పటికప్పుడు తమ సెల్‌ఫోన్‌లో గమనిస్తూ ఉంటారు.
బెదిరించి.. లాక్కెళ్లి..: కారు అమ్మిన ఒకటి రెండు రోజుల్లోనే, జీపీఎస్ ద్వారా దానిని గుర్తించి, కొన్న వ్యక్తి దగ్గరకు వెళ్తారు. “మేమే ఈ కారు అసలు యజమానులం, మా కారును దొంగిలించావ్” అంటూ బెదిరిస్తారు. కేసులు పెడతామని హడలెత్తిస్తారు. కారు కొన్న బాధితుడు, తనకు అమ్మిన వారికి ఫోన్ చేద్దామని ప్రయత్నిస్తే ఆ నంబర్లు పనిచేయవు. ఈ లోపే ముఠా సభ్యులు ఆ సిమ్‌ కార్డులను పారేస్తారు. దీంతో భయపడిపోయిన బాధితుడి నుంచి కారును లాక్కొని ఉడాయిస్తారు. చివరగా, ఏమీ ఎరగనట్టు ఆ కారును తాము అద్దెకు తెచ్చిన సంస్థకు తిరిగి అప్పగించి చేతులు దులుపుకుంటారు.

బాధితుడి ఫిర్యాదుతో బట్టబయలు : 2025 జులై 18న కామారెడ్డికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి ఇలాగే కారు కొని మోసపోయానంటూ మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎస్పీ రాజేష్‌చంద్ర ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఈ ముఠా ఆటకట్టించారు.

వీరే ఆ కిలాడీలు : రంగారెడ్డి జిల్లాకు చెందిన మహ్మద్ ఇయాజ్ ఈ ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతనితో పాటు మహ్మద్ జాహీద్ అలీ, పృథ్వీ జగదీష్, రాచర్ల శివకృష్ణ, కర్ణకోట సాకేత్, వేములమాడ వివేక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అలీ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరంతా శంకర్‌పల్లి, అంబర్‌పేట్, మియాపూర్, చందానగర్ వంటి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి 3 కార్లు, 15 సెల్‌ఫోన్లు, జీపీఎస్ పరికరాలు, ల్యాప్‌టాప్, నకిలీ ఆర్‌.సి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad