కరాచీ బేకరీ అంటేనే ఓ పెద్ద బేకరీ బ్రాండ్ గా మారిపోయింది. నిజానికి ఇది ఒకప్పుడు ఓ చిన్న బేకరీ మాత్రమే. కానీ ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ రేంజ్ లో కరాచీ బేకరీ కూడా సిటీకి బ్రాండ్ అంబాసిడర్ గా, హైదరాబాద్ ఐకన్ గా మారిపోయింది. ఈ స్థాయిలో కరాచీ బేకరీ ఎదగటం, తన బ్రాంచెస్ ను ఎడాపెడా ఓపన్ చేసేయటం ఆమధ్య పెద్దస్థాయిలో జరిగింది.
ఎయిర్ పోర్ట్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఆఖరుకి రైళ్లలో కూడా మీకు కరాచీ ఉత్పత్తులు దొరుకుతాయి. తెలంగాణ, ఏపీతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో, ఆఖరుకి విదేశాల్లో సైతం హైదరాబాద్ లో తయారయ్యే కరాచీ బేకరీ ప్రాడక్ట్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. కానీ ఆ సంస్థ యాజమాన్యం పనితీరు, సేఫ్టీ మెథడ్స్, యాజమాన్యం వ్యవహార శైలి, బేకరీ కిచెన్ లో ఉపయోగించే ముడి పదార్థాల నాణ్యత, అత్యంత అపరిశుభ్రమైన వంటగది, ఉద్యోగులను ట్రీట్ చేసే విధానం అన్నీ వివాదాస్పదంగా మారిపోతున్నాయి. పదేపదే ఎన్ని కంప్లైంట్లు వచ్చినా అదేమిటోకానీ కరాచీ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు లేకపోగా రోజురోజుకీ వీరి వ్యాపారం మరింత పెరిగేలా అధికారులు అండగా నిలుస్తున్నారు.
బేకరీలో తయారయ్యే వస్తువుల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చినా అడపాదడపా వీరి కిచెన్ పై రైడ్స్ చేసి, జస్ట్ నామమాత్రంగా బేకరీని రెండ్రోరోజులు మూసేయించటం రొటీన్ గా మారింది. మళ్లీ షట్టర్లు తెరవటం, రోజు కోట్ల రూపాయల వ్యాపారం చేసేయటం కరాచీ బేకరీకే చెల్లింది. కరాచీ బేకరీలో తయారయ్యే ఆహారం నాణ్యత బాగాలేదని కంప్లైంట్ చేసిన కస్టమర్లు కూడా ఊళ్లో ఇంకేవీ మంచి బేకరీలే లేనట్టు మళ్లీ అక్కడే క్యూలో నించుని, బిల్లు కట్టి మరీ కొనేస్తున్నారు. కుళ్లిన, బూజు పట్టిన, కాలం చెల్లిన రా మెటీరియల్ తో కరాచీ బేకరీ యాజమాన్యం తయారు చేయిస్తున్న ఉత్పత్తులనే మనవాళ్లు ఆబగా తింటుండటం విశేషం.
ఈనేపథ్యంలో తాజాగా కరాచీ బేకరీ ఉత్పత్తులన్నీ తయారయ్యే రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లోని మెగా కిచెన్ లో గ్యాస్ సిలెండర్ పేలి 15 మందికి గాయాలు కాగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈనేపథ్యంలో కరాచీ బేకరీ యాజమాన్యం వ్యవహార శైలి మరోమారు తెరపైకి వస్తోంది.