మహిళలపై హింసలేని సమాజ నిర్మాణమే తమ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చైర్‌పర్సన్ సహా ఏడుగురు సభ్యుల మహిళా కమిషన్ కరీంనగర్‌లో పర్యటించి కలెక్టరేట్ ఆడిటోరియంలో సెమినార్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళల చట్టాలు, వారికున్న హక్కులపై అవగాహన కోసం జిల్లా కేంద్రంలో ఈ సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు. మహిళలకు సమాన హక్కులను రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కులను హరిస్తే కమిషన్ తగు చర్య తీసుకుంటుందని అన్నారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకెళ్లడం అభినందనీయమని అన్నారు. కానీ నేటి సమాజంలోనూ మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య వస్తే చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని, కానీ సమస్య వస్తే పరిష్కరించేందుకు కమిషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. గర్భస్థ శిశువు మొదలుకుని మరణించేంతవరకు మహిళల సంరక్షణకు అనేక చట్టాలున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మహిళల రక్షణ విభాగాన్ని కూడా ఏర్పాట్లు చేసిందన్నారు. మహిళలు తమ సమస్యలను కాగితంపై రాసిస్తే చాలని, ఆ లేఖను పోస్టు లేదా ఈమెయిల్ ద్వారా పంపినా స్వీకరించి న్యాయం చేస్తామని తెలిపారు. వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని అన్నారు. వసతిగృహాలు, జైళ్లు, స్వధార్‌హోం, వృద్ధాశ్రమం వంటి మహిళలుండే ఏ చోటునైనా పర్యవేక్షించే అధికారం తమకు ఉందని అన్నారు. లింగవివక్షను రూపుమాపాలని, పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆడపిల్లలను బాగా చదివించాలని, అప్పుడే ఏ సమస్యనైనా తట్టుకునే శక్తి వారికి వస్తుందని అన్నారు. మహిళా చట్టాలపై అంగన్‌వాడీలు, ఆశల ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ ఆడ, మగ భేదం లేకుండా సమానత్వంలో చూడాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఎంతో మంది మహిళలు ఉన్నతాధికారుల, ప్రజాప్రతినిధుల స్థానంలో ఉండడం అభినందనీయమని అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్ననాటి నుండే మంచి అలవాట్లు అలవర్చుకునే చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ మహిళలు ఒకరికొకరు సహకారంతో ఉండాలని, ఒక్కటిగా సంకల్పంతో ముందుకు సాగాలని కోరారు. కరోనా సమయంలో జిల్లాలో ఉన్న వందలాది మంది ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో ఆ మహమ్మారి జయించామని, ఇదంతా కేవలం మహిళలతోనే సాధ్యమైందని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లాలో మహిళలందరికీ హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి దేశంలోనే తొలిసారిగా గుర్తింపు పొందామని తెలిపారు. జిల్లాలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఉన్నారని దళితబంధు ద్వారా జిల్లాలో సుమారు రూ.18 వందల కోట్ల సాయాన్ని ప్రభుత్వం కల్పించిందని అందులో 10 వేల మంది లబ్దిదారులు మహిళలే ఉన్నారని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, మహిళా కమిషన్ సభ్యులు షాహిన్ అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరి భాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, శుద్ధం లక్ష్మి, కటారి రేవతి, మహిళా కమిషన్ డైరెక్టర్ శారద, మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి, డిడబ్ల్యూఓ సబితాకూమారి తదితరులు పాల్గొన్నారు.