కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్ లో మూడు రోజుల పాపను ఎత్తుకెళ్లిన వ్యక్తిని సిసి పుటేజీ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 18న కరీంనగర్ మాతశిషు హాస్పిటల్ లో మూడు రోజుల పాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారని హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. దీంతో కరీంనగర్ పట్టణ ఏసీపీ గోపతి నరేందర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్ తన సిబ్బందితో యుక్తముగా సంఘటన స్థలంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించినట్లు చెప్పారు.
పోలీస్, టాస్క్ ఫోర్స్, ఎస్ బి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, సీసీ ఫుటేజ్ ఆధారంగా పాపను తీసుకెళ్ళిన వ్యక్తిని గుర్తించినట్టు చెప్పారు. పాపను ఎత్తుకెళ్లిన మహిళను పట్టుకొని విచారించగా ఆమెకు
పిల్లలు లేనందున జమ్మికుంటలోని ఎర్రమరాజు జగ్గంరాజు డాక్టర్ సలహా మేరకు కరీంనగర్ కి వచ్చి కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్ నందు ఎవరినైనా కిడ్నాప్ చేద్దామని పాప గురించి వెతుకుతూ, ఒక బాబు వద్ద ఒక పాప కనిపించగా అతనికి తెలుగు సరిగ్గా రానందున నేను పాపకు వ్యాక్సిన్ వేసుకొని వస్తానని మాయమాటలు చెప్పి, అతని వద్ద నుండి పాపను తీసుకొని నడుచుకుంటూ ఆటోలో కరీంనగర్ బస్టాండ్ కి
వెళ్లి, అక్కడి నుండి జమ్మికుంట బస్సులో వెళ్లి అక్కడ ఎర్రమరాజు జగ్గంరాజు అను డాక్టర్ కి చూపించగా అతను చూసి పాపకి పాలు తెప్పించి త్రాగించి పాప బాగుందని చెప్పగా, అక్కడి నుండి పాపను తీసుకొని బస్ లో తన స్వగ్రామం తక్కళ్ళపల్లికి వేళ్లినట్టు, పాపను నా వద్దనే ఉంచుకొని పాపను నా స్వంత పనులకు, అవసరాల నిమిత్తం వాడుకొని డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో పాపను ఎతుకొని వెళ్లినట్టు ఆమె తెలిపినట్లు చెప్పారు.
అపహరణకు గురైన పాపను గుర్తించడములో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. పాపను తన తల్లి ఒడికి చేర్చి పాపను ఎత్తుకెళ్లిన మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.