ప్రతినేరస్థుడికి శిక్ష పడేలా అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని కరీంనగర్ అడిషనల్ పోలీస్ కమిషనర్ (పరిపాలన) జీ చంద్రమోహన్ అన్నారు. శ్రద్ధాసక్తులు, ఉత్సాహం తో పనిచేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో కోర్టు డ్యూటీ అధికారుల (సీడీవో) శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రమోహన్.. ప్రతి కేసులోని దశలను సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సిడివోలు కేసులు ఏయే దశల్లో ఉన్నాయో ఏరోజుకారోజు సిసిటిఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఏరోజు పనిని ఆరోజే పూర్తిచేయాలని, వాయిదా వేయడం పద్దతి సరైందికాదని సూచించారు. ఏనేర సంఘటనైనా ఒక ఛాలెంజ్ గా తీసుకుని ప్రణాళికబద్దంగా ముందుకుసాగితే సఫలీకృతం అవుతామనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. నేరస్థులకు శిక్ష పడితే పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు.