Wednesday, October 30, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: నకిలీ పత్రాలు-రిజిస్ట్రేషన్..ఆపై లోన్లు..ఇక్కడ రొటీన్!

Karimnagar: నకిలీ పత్రాలు-రిజిస్ట్రేషన్..ఆపై లోన్లు..ఇక్కడ రొటీన్!

బాధితురాలి ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి.

డబ్బుకు లోకం దాసోహం అనే నానుడిని నిజం చేస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు. వక్రమార్గంలో డబ్బులు సంపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఒకరి పేరుపై ఉన్న భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అట్టి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో ప్రైవేట్ ఫైనాన్స్ లో లోన్ సైతం తీసుకుంటున్నారంటే రిజిస్ట్రేషన్ అధికారులు కానీ అక్రమార్కులకు ఏ విధంగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

భూమి రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని రకాలుగా పత్రాలను పరిశీలించిన మీదటనే రిజిస్ట్రేషన్ చేసే అధికారులకు ముడుపులు ముడితే అవేవీ పట్టించుకోకుండానే గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేయడం విస్మయం కలిగిస్తుంది. దీనికి తోడు తప్పుడు రిజిస్ట్రేషన్ కాగితాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే సదరు డాక్యుమెంట్ ఆధారంగా రూ. 30 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో చోటు చేసుకుంది కాదు కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రేకుర్తిలోనే….


బాధితురాలు తెలిపిన వివరాలు అక్రమ రిజిస్ట్రేషన్, ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ మంజూరుపై బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి పరిధిలోని సర్వేనెంబర్ 67/Aలో 254 చ॥గజముల భూమిని కొత్తపల్లి విజయలక్ష్మి 2017లో కొనుగోలు చేసి 4375/2017 డాక్యుమెంట్ 22-11-2017 రోజున గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. రేకుర్తి గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణం కోసం 08-07-2018 రోజున అనుమతి తీసుకుని అనివార్య కారణాల వల్ల ఇంటి నిర్మాణం చేయకపోవడంతో అట్టి స్థలం ఖాళీగా ఉందని గ్రహించిన చిదుర భావన తప్పుడు ధృవీకరణ పత్రాలతో సర్వే నెం. 67 అని డాక్యుమెంట్ సృష్టించుకుని, కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ఇంటి నెం. 3-67/6/A/1 తీసుకున్నారు. అనంతరం యముండ్ల మల్లేష్ పేరున డాక్యుమెంట్ నెం. 3312/2022 ద్వారా 09-06-2022 రోజున రిజిస్ట్రేషన్ చేయించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి 6903/2022 ద్వారా 17-11-2022 రోజున మున్సిపల్ కార్పొరేషన్ కు డీడ్ ఆఫ్ గిఫ్ట్ సెటిల్మెంట్ చేయించారు. 1579/ 2024 డాక్యుమెంట్ ద్వారా 23-02-2024 రోజున మార్టిగేజ్ చేసి ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ద్వారా రూ,30 లక్షల లోన్ సైతం తీసుకున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థ కమిషనర్ కు 03-04-2024 రోజున తప్పుడు ధృవీకరణ పత్రాలతో పొందిన ఇంటి నెంబర్ ను రద్దుపర్చాలని విజయలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 03-04-2024 రోజున జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారికి సైతం తప్పుడు డాక్యుమెంట్లను రద్దుపర్చాలని ఫిర్యాదు చేశారు. జిల్లా రిజిస్ట్రార్ గంగాధర సబ్ రిజిస్ట్రార్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించే రిజిస్ట్రేషన్ చేసినారని విజయలక్ష్మి కి మెమో ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ ఆజ్ఞ పత్రము నెం. GP/RKT/166/2019, 11/03/2019 లో ఎలాంటి పేరు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం విశేషం.

మామూళ్లు ఇస్తే ఏదైనా సాధ్యం
రెక్కలు ముక్కలు చేసుకుని సొంతింటిని నిర్మించుకోవాలని ఎన్నో కలలు కని ఇల్లు నిర్మించుకునేందుకు సొంత జాగాను కొనుగోలు చేస్తే అట్టి స్థలంలో ఇంటి నిర్మాణం చేయడంలో కొంత కాలయాపన జరిగితే చాలు అక్రమార్కుల కళ్ళు సదరు ఖాళీ స్థలంపై పడుతాయి. ఇంకేముంది సంబంధిత అధికారులను మంచిగా చేసుకోవడం మామూళ్లు ముట్ట చెప్పడం ఖాళీ స్థలానికీ నకిలీ పత్రాలు సృష్టించి ఎవరో ఒకరి పేరున రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా అట్టి తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలతో వారికి అనుకూలంగా ఉండే ప్రైవేట్ ఫైనాన్స్ అధికారులతో మూలాకతై వారికి కొంత డబ్బులు ముట్టజెప్పి ఇండ్ల నిర్మాణాలు చేపట్టకుండానే ఇండ్లు నిర్మించామని నమ్మబలికి లక్షల్లో లోన్లు తీసుకోవడం ఇక్కడ నిత్య కృత్యంగా మారుతుంది. ఇదే రేకుర్తిలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ విజయలక్ష్మి తనకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తేవడంతో ఇలాంటి సంఘటనలు మరిన్ని ఉన్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతుంది. ఇలాంటి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ప్రైవేట్ ఫైనాన్స్ లల్లో లక్షలకొద్దీ డబ్బులు పొందిన మూట ఇక్కడ ఉన్నట్లు గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. దీనిపై కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ , మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. మరి ఏ మేరకు జిల్లాస్థాయి అధికారులు స్పందిస్తారో వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News