mid-day meal scheme fails in Karimnagar: కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం మరోసారి వికటించింది. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో సోమవారం వడ్డించిన మధ్యాహ్న భోజనం తిని 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, సోమవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించారు. భోజనం చేసిన కొద్దిసేపటికే పలువురు విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరుగా విద్యార్థులు అస్వస్థతకు లోనవడంతో, అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మొత్తంగా 71 మంది విద్యార్థులు భోజనం చేయగా, వారిలో సుమారు 26 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో 17 మంది పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉండటంతో వారికి ప్రత్యేక చికిత్స అందించారు. ముగ్గురు విద్యార్థులకు వైద్యులు ఐవీ ఫ్లూయిడ్స్ (సెలైన్) ఎక్కించాల్సి వచ్చింది. ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు గల కారణాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో వడ్డించిన గుడ్లు కుళ్లిపోయి దుర్వాసన వచ్చాయని, అన్నంలో పురుగులు కూడా ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని వంట సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని వాపోయారు.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో భోజన నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలువురు స్థానిక నాయకులు కూడా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.


