కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మొహంతి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు నేరుగా సంప్రదిస్తే అన్యాయానికి పాల్పడ్డవారు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ బాధితులకు న్యాయం చేస్తూ జిల్లా ప్రజల మన్నలను పొందుతున్నారు.
ఆయన పేరు వినగానే కరుడుగట్టిన నేరస్తుల గుండెల్లో సైతం రైళ్లు పరిగెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో భూకబ్జాలకు పాల్పడిన వారిపై బాధితుల నుండి ఫిర్యాదులు రావడంతో భూ కబ్జాదారులపై కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేస్తూ పోలీస్ అధికారి అంటే ఇలా ఉండాలని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణ న్యాయం జరిగాలనేదే ఆయన లక్ష్యం. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ తమ శాఖలో పనిచేసే కొంతమంది సిబ్బంది మాత్రం అక్రమ సంపాదనకు అలవాటు పడి తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తుంది.
కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి అంటేనే అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారుతున్న తరుణంలో తమ శాఖలోనే కొంతమంది సిబ్బంది అక్రమ సంపాదనకు పాల్పడుతుండడం సర్వత్ర చర్చనీయాంశంగా మారుతుంది. హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ముగ్గురు కానిస్టేబుళ్లను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల సిపి కార్యాలయానికి అటాచ్ చేయడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
కానిస్టేబుళ్లపై చర్యలు సరే.. మరి అధికారులపై లేవా. హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లు వసూళ్లకు పాల్పడుతూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకు అనుకూలంగా ఉన్నారని ఇటీవల సీపీ కి ఫిర్యాదులు వెళ్లడంతో ఐదు రోజుల క్రితం ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హుజురాబాద్ సీఐ వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్న అవినాష్ తో పాటు జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భాస్కర్ రెడ్డి, జమ్మికుంట గ్రామీణ సీఐ వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్న పాషా పై బాధితులు సీపీకి ఫిర్యాదులు చేయడంతో పూర్తిస్థాయిలో అంతర్గత విచారణ చేపట్టిన సిపి ముగ్గురిని తన కార్యాలయానికి అటాచ్ చేసుకున్నారు. ఈ మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ప్రధానంగా ఇసుక, రేషన్ బియ్యం, మట్టి దందాకు అడ్డు అదుపు లేకుండా ఉంది. అక్రమ దందా చేసే వారి వద్ద నుండి పోలీస్ స్టేషన్ కు నెలవారి మామూళ్లు కొంత ముట్ట చెప్పాల్సి ఉంటుందని ప్రచారం జోరుగా ఉంది. అక్రమ దందా చేసేవారి నుండి మామూళ్లు వసూలు చేసిన కానిస్టేబుళ్ల పై చర్యలు సరే! మరి వసూలు చేయించిన అధికారులపై చర్యలు లేవా? అని డివిజన్ పరిధిలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్ సీఐ కింద పని చేసిన అవినాష్ వసూళ్ల లో దిట్ట..కానీ వసూలు చేసి అతనొక్కడే తీసుకున్నాడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కానిస్టేబుళ్లు అక్రమంగా వసూలు చేసిన డబ్బులు ఎవరికి ఇచ్చారు? అనే విషయం పై విచారణ చేపట్టాలని, వసూల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవడం కన్నా వసూలు చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ప్రజలు కోరుతున్నారు. అటాచ్ చేసుకున్న కానిస్టేబుళ్ల నుండి వివరాలను సేకరిస్తున్న పోలీస్ బాస్.
అవినీతి ఆరోపణ నేపథ్యంలో అంతర్గత విచారణ చేపట్టిన అనంతరం ముగ్గురు కానిస్టేబుళ్లను సిపి కార్యాలయానికి అటాచ్ చేసుకున్న సీపీ అభిషేక్ మొహంతి సదరు పోలీస్ కానిస్టేబుళ్ల నుండి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. వారిపై వచ్చిన అవినీతి ఆరోపణల వారీగా సమాచారం సేకరిస్తుండడంతో బాధ్యులైన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో జోరుగా చర్చ జరుగుతుంది.