పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ హెచ్ఓలు పెండింగ్ కేసులు తగ్గించేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ఆదేశించారు. పెండింగ్ కేసులు పరిమిత సంఖ్యకు లోబడి ఉండాలని ఆదేశించారు. కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో కమిషనరేట్ లోని ఎస్ హెచ్ఓ లు, కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు: మాట్లాడుతూ నేరాలను ఛేదించడాన్నిసవాల్ గా తీసుకోవడంతో పాటు నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రతి నేరంలోనూ నిందితులకు శిక్షపడేలా అన్నిస్థాయిలకు చెందిన అధికారులు పరస్పర సహకారంతో కృషిచేయాలని చెప్పారు. ప్రతి కేసులోని దశలను సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా నిందితులకు శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్, ఏసిపి పి కాశయ్య, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లులతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.