వివిధ కేసుల్లో పరారీలో ఉన్న నిందితులపై వారెంట్లను వేగవంతంగా అమలు చేయడం ద్వారా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని కరీంనగర్ పోలీస్ అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్ అన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు కోసం ప్రత్యేక బృందాలు నూతనోత్సాహంతో పనిచేయాలని చెప్పారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సమన్లు, వారెంట్ల అమలు, మెడికల్ సర్టిఫికెట్ల విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో మంగళవారం నాడు కమిషనరేట్ కేంద్రంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్ మాట్లాడుతూ సమన్లు, వారెంట్లను వేగవంతంగా అమలుచేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న నిందితులపై అమల్లో ఉన్న వారెంట్లను అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్ళాలని చెప్పారు. ప్రణాళికాబద్దంగా ముందుకుసాగినట్లయితే వారెంట్లను అమలు చేయడంలో సఫలీకృతం కావొచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో మెడికల్ సర్టిఫికెట్లను సాధ్యమైనంత తొందరగా తీసుకరావాలని చెప్పారు. పెండింగ్ వారెంట్లు అమలుచేయడం ద్వారా దీర్ఘకాలం నుండి అపరిష్కృతంగా ఉన్న కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలకు సేవలందించేందుకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. న్యాయస్థానాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యాధికారులతో సత్సంబంధాలను కొనసాగించాలని సూచించారు. వారెంట్లు, సమన్లు వేగవంతంగా అమలుకావడం, వివిధ రకాలకు సంబంధించిన ప్రమాదాల్లో మెడికల్ సర్టిఫికెట్లు నిర్ణీత వ్యవధిలోపు అందజేసినట్లయితే నిందితులు శిక్షింపబడటంతోపాటు బాధిత ప్రజలకు న్యాయం చేసినవారవుతామని చెప్పారు. సమన్లు, వారెంట్లను వేగవంతంగా అమలుచేస్తూ నిందితులు శిక్షింపబడటంలో కీలకపాత్ర పోషించే అన్నిస్థాయిలకు చెందిన అధికారులకు రివార్డులను అందజేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఏసిపిలు పి కాశయ్య, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.