కౌడిపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ (అవినీతి నిరోధక చట్టం) అధికారులు ఆకస్మికంగా చేసిన దాడుల్లో 20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ధరణి ఆపరేటర్. ఓ రైతు వద్ద నుండి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ధరణి ఆపరేటర్ వేణు రెడ్డి పట్టుబడినట్లు మెదక్ రేంజ్ ఏసిబి డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.
మండలానికి చెందిన నీరుడి పోచయ్య గత నెల జనవరి 25వ తేదీన తమ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నీరుడి పోచయ్య 20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో 10 గుంటల భూమిని అమ్ముకున్నట్టు ఆయన తెలిపారు. మిగిలిన 10 గుంటల భూమిని తన పేరా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ వేణు రెడ్డిని సంప్రదించగా.. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ. 20 వేలు లంచంగా ఇవ్వాలని ఖరాకండిగా చెప్పినట్టు అధికారులు తెలిపారు.
లంచం అడిగితే వెంటనే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్ కు సమాచారం అందించాలని వారి పేర్లు వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. కాగా కౌడిపల్లి తాసిల్దార్ కార్యాలయ ధరణి ఆపరేటర్ వేణు రెడ్డి లంచం తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వేణు రెడ్డి స్వగృహమైన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో సైతం ఏకకాలంగా ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విచారణలో నిజరూపణాలు జరిగితే ధరణి ఆపరేటర్ వేణు రెడ్డి అతని సహకరించిన కేతావత్ రాజులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ తో పాటు ఇన్స్పెక్టర్లు వెంకట రాజా గౌడ్, రమేష్ ఏసీబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.