Honor Killing in kumaram bheem district: తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం జిల్లాలో పరువు హత్యకు సంబంధించిన దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. దహేగాం మండలం పరిధిలోని గిరివెళ్లి గ్రామంలో శివార్ల సత్తయ్య అనే వ్యక్తి కులదురహంకారంతో కళ్ళు మూసుకుపోయి, తన కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సొంత కోడలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతురాలు తలండి రాణి (23) ఎనిమిది నెలల నిండు గర్భిణి.
గత సంవత్సరం, శివార్ల శేఖర్ మరియు తలండి రాణి ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని శేఖర్ తల్లిదండ్రులు, ముఖ్యంగా అతని తండ్రి శివార్ల సత్తయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కులానికి అప్రతిష్ట వచ్చిందని, పరువు పోయిందని భావించిన సత్తయ్య దంపతులు, తమ అభ్యంతరాలను పక్కనపెట్టి యువజంట తమ ఇంట్లోనే కాపురం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొత్తగా పెళ్లైన దంపతులు మొదట్లో తాత్కాలికంగా వ్యతిరేకించినా, మెల్లగా తల్లిదండ్రులు తమను అర్థం చేసుకుంటారని ఆశించారు.
కానీ, కాలం గడుస్తున్న కొద్దీ, సత్తయ్య మనసులో కుల దురభిమానం మరింత పెరిగిపోయింది. కులాంతర వివాహం పట్ల రగిలిపోతున్న ద్వేషంతో, తన కొడుకు భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, తన కోడలు రాణిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అప్పటికే రాణి గర్భం దాల్చి ఎనిమిది నెలలు కావడంతో, ఆమె కడుపులో ఉన్న బిడ్డను కూడా చూడకుండా ఈ దారుణానికి పాల్పడ్డాడు. కన్న తల్లిదండ్రులను, బంధువులను వదులుకుని ప్రేమించిన వ్యక్తి కోసం వచ్చిన రాణి ఆశలు అడియాశలయ్యాయి. వారసుడిని చూసైనా మామ మారుతాడని ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ కేసును పరువు హత్యగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.


