కొత్తపల్లి మండలంలో చిరుత సంచారం రోజుకోచోట కలవరం పెడుతోంది. సోమవారం వేకువ జామున మండల పరిధిలోని బలపాలతిప్ప గ్రామంలో ఓ ఇంట్లో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. ఆవు ఆర్తనాదాలు విన్న యజమాని పశువుల నారాయణ ఇంట్లో నుంచి బయటకు రాగా చిరుత అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు అటవీ శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకుని చిరుత పాద ముద్రలు సేకరించి, చిరుత కోసం అన్వేషణ చేపట్టారు. చిరుత మళ్లీ వచ్చే అవకాశం ఉండడంతో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
