Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుMachilipatnam: బాధిత గిరిజన మహిళలకు ఒక్కొక్కరికి 2 లక్షల పరిహారం

Machilipatnam: బాధిత గిరిజన మహిళలకు ఒక్కొక్కరికి 2 లక్షల పరిహారం

ముగ్గురు గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు

మోపిదేవి మండలం, కే. కొత్తపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన వ్యక్తులపై రాష్ట్ర ఎస్టి కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ పేర్కొన్నారు.

- Advertisement -

మంగళవారం మధ్యాహ్నం ఆయన ఇటీవల మోపిదేవి మండలం, కే. కొత్తపాలెం గ్రామంలో భూస్వామి మత్తి రాజచంద్ అనే వ్యక్తి ఇతరులతో కలిసి యానాది సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన ఘటనలో మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తో కలిసి బాధితులను పరామర్శించారు. దాడి ఘటన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు. రూ.50 వేల తక్షణ పరిహారం మంజూరు ఉత్తర్వులను బాధితురాలు దుర్గాకు అందజేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చూడాలని వైద్యులు పవన్ కుమార్ కు సూచించారు.

అనంతరం ఆయన ఆసుపత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ అభం శుభం తెలియని గిరిజన మహిళలపై జరిగిన దాడి హేయమైన చర్య అని, దీనిని రాష్ట్ర ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కమిషన్ ఆదేశించిదన్నారు.

బాధిత ముగ్గురు మహిళలలో ఒకరైన రాచూరి దుర్గా అనే మైనర్ బాలికను ఇంటికి తీసుకువెళ్లి కులం మతం పేరుతో దాడికి పాల్పడటం ఏ సభ్య సమాజం స్వాగతించదని, ఆమెకు చికిత్స అనంతరం ప్రభుత్వం తరపున అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తుందన్నారు. దీనితో పాటు రాచూరి దుర్గా, కోనేటి పద్మ, తుమ్మా రమణ ముగ్గురు మహిళలకు స్థిరనివాసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.

దాడిలో గాయపడిన మహిళలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున పరిహారం జిల్లా కలెక్టర్ వారి ద్వారా అందించనున్నామని, ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పన తక్షణ సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిందని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయని సాహసోపేత నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గిరిజన ముగ్గురు మహిళలపై దాడికి పాల్పడిన బాధ్యులపై తగిన చర్య తీసుకుని బాధితులకు తగిన న్యాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ గిరిజన వ్యక్తికైనా ఎలాంటి ఆపద వచ్చినా కులమత ప్రాంత పార్టీలకతీతంగా ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పారు.

బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతో పాటు వారిపై దాడి చేసిన స్థానిక ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఈ సందర్భంగా ఆయన కోరారు.

రాష్ట్ర ఎస్సీ కమిషన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ కూలికి వచ్చిన గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన భూ యజమాని రాజ చంద్, అతని సోదరి రాధిక, సచివాలయ మహిళా కానిస్టేబుల్, స్థానిక ఎస్సై పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అట్టివారిని చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షిస్తుందన్నారు.

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కుల ఆనందబాబు, జిల్లా యానాది సంఘాల అధ్యక్షులు శ్రీనివాసరావు, వివిధ గిరిజన దళిత సంఘాల నాయకులు తదితరులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News