మనకు జన్మనిచ్చేందుకు తన ప్రాణాలనే పణంగా పెడుతుంది తల్లి. అలాంటి తల్లికి గుడికట్టి పూజ చేసినా తప్పు లేదు. కానీ.. ఈ రోజుల్లో కొందరు దుర్మార్గులు తమ తల్లుల్ని దేవతల్లా కాదు కదా.. కనీసం మనిషిలా కూడా చూడట్లేదు. తాజాగా ఓ దుర్మార్గపు కొడుకు తన తల్లిని నడిరోడ్డుపై విచక్షణ రహితంగా తన్నిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నవంబర్ 23న ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
యూపీలోని మహారాజ్ గంజ్ కి చెందిన రితేష్ వర్మ అనే వ్యక్తి తన తల్లిని నడిరోడ్డుపై పడేసి తీవ్రంగా కొట్టాడు. కొట్టొద్దు.. కొట్టొద్దు అని ఆ తల్లి ఎంత అరిచినా వినిపించుకోకుండా కాళ్లతో తన్నాడు. అడ్డొచ్చిన వ్యక్తిని బలంగా తోయడంతో ఆ ఘటనను ఆపేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ ఘటనంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. తీవ్రంగా కొట్టడంతో ఆ తల్లి పైకి లేవలేక అక్కడే పడిపోయింది. కొద్దిసేపటికి కొడుకు ఇంట్లోకి వెళ్లిపోగా.. స్థానికులు ఆమెను పక్కకు తీసుకెళ్లి నీళ్లు తాగించారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించగా..తల్లి రితేష్ వర్మపై ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. అతడిపై ఐపీసీ 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.