జ్యోడిష్యుడి సలహాని గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి నాలుకను కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ-రోడ్ లోని గోపిచెట్టిపాళయంకు చెందిన రాజా వృత్తి రీత్యా రైతు. అతని వయసు 54 సంవత్సరాలు. రైతు అన్నాక పొలంలో పాములు కనిపించడం సహజమే. కానీ రాజాకు ఇటీవల తరచూ.. కలలో పాము కాటు వేస్తున్నట్లు కనిపించింది. దాంతో భయపడి స్థానిక జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అతను ఈ పీడకలలు పోవాలంటే.. పాము పుట్ట ఉన్న ఆలయానికి వెళ్లి పూజలు చేశాక.. పుట్ట ముందు మూడుసార్లు నాలుక బయటికి చాపాలని సలహా ఇచ్చాడు.
జ్యోతిష్యుడి సలహాని గుడ్డిగా పాటించిన రాజా తన నాలుకని కోల్పోయాడు. చెప్పినట్టుగానే రాజా ఓ సర్పమందిరానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం.. జ్యోతిష్కుడు చెప్పినట్టుగా పుట్ట వద్దకువెళ్లి మూడుసార్లు నాలుక బయటికి చాపాడు. పుట్టలో ఉన్న రక్తపింజరి పాము రాజా నాలుకపై కసిదీరా కాటేసింది. వెంటనే ఆలయ పూజారి, రాజా కుటుంబ సభ్యులు పాము కాటువేసిన ప్రాంతంలో నాలుకను కోసివేసి.. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. నాలుకను కోసివేయడంతో రాజాకి తీవ్రరక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
ఆస్పత్రిలో వైద్యులు సగం తెగిపోయిన నాలుకకు చికిత్స చేసి.. పాము విషానికి విరుగుడుగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని ఆస్పత్రి ఎండీ సెంథిల్ కుమరన్ వెల్లడించారు. జ్యోతిష్యులు చెప్పిన సలహాలను గుడ్డిగా పాటించడం ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.