Man Murders Mother Over Land Dispute, Then Kills Self: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం కారణంగా ఒక వ్యక్తి తన 70 ఏళ్ల తల్లిని హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెనాపూర్ తాలూకాలోని సాంగ్వి గ్రామంలో జరిగింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
భూమి అమ్మకం విషయంలో గొడవ..
మృతులను లక్ష్మీబాయి ఘుగే (70), ఆమె కుమారుడు బాబన్ ఘుగే (45)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో, వారి కుటుంబంలో కొంతకాలంగా భూమి అమ్మకం విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. డబ్బు అవసరం కోసం భూమిని అమ్మాలని బాబన్ తన తల్లి లక్ష్మీబాయిపై ఒత్తిడి తెస్తున్నాడు, కానీ ఆమె అందుకు నిరాకరించారు. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
తల్లిని చంపి చెరుకు తోటలో పాతిపెట్టి..
కొన్ని రోజుల క్రితం, తీవ్రమైన కోపంలో బాబన్ తన తల్లి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని సమీపంలోని చెరుకు తోటలో పాతిపెట్టాడు. లక్ష్మీబాయి కనిపించకపోవడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి వెతకడం ప్రారంభించారు. చెరుకు తోటలో పాతిపెట్టిన చోట భూమి కొత్తగా తవ్వినట్లు గుర్తించి, అక్కడి నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న బాబన్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రెనాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం తల్లి, కొడుకులకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది.


