Women suicide with Myrmecophobia: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన వెలుగు చూసింది. మైర్మెకోఫోబియా (Myrmecophobia) అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అమీన్‌పూర్‌లోని శర్వా హోమ్స్‌లో నివాసం ఉంటున్న శ్రీకాంత్, మనీషా (25) దంపతులకు ఒక కుమార్తె ఉంది. గత కొంతకాలంగా మనీషాకు చీమలంటే విపరీతమైన, భరించలేని భయం ఉండేది. మానసిక వైద్య పరిభాషలో దీన్ని మైర్మెకోఫోబియా అంటారు.
చికిత్స తీసుకున్నా ఫలితం లేక:
మనీషా ఈ సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఎన్నో ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ఆమెకు కౌన్సిలింగ్‌తో పాటు పలు చికిత్సలు కూడా ఇప్పించారు. అయితే దేని వల్ల కూడా ఆమెలో ఆ భయం తగ్గలేదు. దీంతో మనీషా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. తన సమస్యకు పరిష్కారం దొరకలేదనే మనస్తాపంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్:
సాయంత్రం విధులను ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త శ్రీకాంత్, లోపలి నుంచి గడియ పెట్టి ఉన్న గది తలుపులు పగలగొట్టి చూడగా, భార్య విగతజీవిగా కనిపించింది. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ నోట్‌లో మనీషా తన భర్తను ఉద్దేశిస్తూ… “శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు. అన్విని జాగ్రత్తగా చూసుకో.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులను తీర్చండి” అని రాసింది. ఈ సూసైడ్ నోట్‌ను చదివిన కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మైర్మెకోఫోబియా అంటే ఏమిటి?:
మైర్మెకోఫోబియా అనేది చీమల పట్ల లేదా చీమలకు సంబంధించిన వాటి పట్ల ఉండే ఓ రకమైన ఫోబియా. ఈ రకమైన ఫోబియాలతో బాధపడేవారు తమ భయాన్ని నియంత్రించుకోలేరు, అది వారి రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఈ ఫోబియాలకు కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT), మరియు కొన్నిసార్లు యాంటి-యాంగ్జైటీ మందులతో చికిత్స చేస్తారు. మనీషా విషయంలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడం ఈ సమస్య తీవ్రతను సూచిస్తోంది.
ఈ విషాద ఘటన మానసిక ఆరోగ్య సమస్యల పట్ల, ముఖ్యంగా ఫోబియాల వంటి వాటి పట్ల అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.


