Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుHorrific Murder in Medchal: అనుమానం పెనుభూతం.. గర్భవతిని కోసి మూసీలో పారేశాడు!

Horrific Murder in Medchal: అనుమానం పెనుభూతం.. గర్భవతిని కోసి మూసీలో పారేశాడు!

Crime of passion and suspicion : పెళ్లయిన నెల రోజుల నుంచే అనుమానం.. ఊరందరి ముందు పంచాయితీలతో పరువు పోయిందన్న కక్ష.. ఈ రెండూ కలిసి ఓ భర్తను కిరాతకుడిగా మార్చాయి. కట్టుకున్న భార్య, కడుపులో పెరుగుతున్న బిడ్డ అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా హత్య చేశాడు. హ్యాక్సా బ్లేడుతో శరీరాన్ని ముక్కలు చేసి, మూటగట్టి మూసీ నదిలో పారేశాడు. మేడిపల్లిలో సంచలనం సృష్టించిన ఈ గర్భవతి హత్య కేసులోని పూర్తి వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. 

- Advertisement -

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చిన మహేందర్ రెడ్డి పైశాచికత్వం వెనుక అనుమానం, పంతం ప్రధాన కారణాలని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ ఘటన జరిగిన తీరును దశలవారీగా పరిశీలిస్తే, మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది.

పెళ్లి నాటి ప్రేమ.. అనుమానంతో అబార్షన్ : మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం కొద్దిరోజులకే కల్లోలంగా మారింది. స్వాతి గర్భం దాల్చిన తర్వాత, ఆమెపై మహేందర్‌కు అనుమానం పెరిగింది. ఆ అనుమానంతోనే, ఆమెకు ఇష్టం లేకున్నా వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. ఈ విషయంలో గొడవలు జరిగి, స్వాతి ఫిర్యాదుతో వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.

రాజీ పడ్డా మారని తీరు.. పంచాయితీలతో కక్ష : పెద్దల జోక్యంతో ఇద్దరూ రాజీపడి హైదరాబాద్‌కు వచ్చి కాపురం పెట్టారు. స్వాతి ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగంలో చేరడంతో మహేందర్ అనుమానం మరింత పెరిగి, ఉద్యోగం మాన్పించాడు. దీంతో వారి మధ్య గొడవలు ముదిరి, స్వాతి తరచూ బంధువుల వద్ద పంచాయితీలు పెట్టించేది. ఇది ఊరందరి ముందు తన పరువు తీస్తోందని మహేందర్ తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు.

పుట్టింటికి వెళ్తాననడమే ప్రాణం తీసింది : రెండోసారి గర్భం దాల్చిన స్వాతి, ఈ నెల 27న వైద్య పరీక్షల అనంతరం పుట్టింటికి వెళ్తానని చెప్పింది. భార్య పదేపదే పుట్టింటికి వెళ్తాననడం, మహేందర్‌లోని అనుమానాన్ని, కక్షను రెట్టింపు చేసింది. ఆమెను అంతమొందించాలని అక్కడే నిర్ణయించుకున్నాడు.

పక్కా ప్రణాళికతో హత్య, సాక్ష్యాల మాయం : హత్య చేసే ముందు, మేడిపల్లిలోని స్వాతి పిన్ని ఇంటికి వెళ్లి, గొడవ సర్దుబాటుకు రమ్మని పిలిచాడు. ఆమె తర్వాత వస్తానని చెప్పడంతో, ఇంటికి తిరిగి వచ్చి భార్యను హత్య చేశాడు. అనంతరం అత్యంత కిరాతకంగా, హ్యాక్సా బ్లేడుతో శరీరాన్ని తల, మొండెం, చేతులు, కాళ్లుగా వేరు చేశాడు.

మూటగట్టి మూసీలో: చెత్త వేసే నల్ల కవర్లలో శరీర భాగాలను వేర్వేరుగా కుక్కాడు. చేతులను ఓ బస్తాలో, కాళ్లను ఓ బరువైన రాయికి కట్టి మరో బస్తాలో వేసి, బైక్‌పై తీసుకెళ్లి ప్రతాపసింగారం వద్ద మూసీ నదిలో పారేశాడు.

బతికుందని నమ్మించే యత్నం: హత్య తర్వాత, స్వాతి ఫోన్ నుంచి ఆమె చెల్లెలికి ‘తిన్నారా’ అని మెసేజ్‌లు పంపి, ఆమె బతికే ఉందని నమ్మించే ప్రయత్నం చేశాడు.

తాపీగా సిగరెట్.. పోలీసుల ముందు లొంగుబాటు : ఈ ఘోరం చేసిన తర్వాత, సమీపంలోని పాన్ షాపునకు వెళ్లి తాపీగా సిగరెట్ తాగాడు. బంధువులు అడగటంతో, స్వాతి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని కట్టుకథ అల్లాడు. చివరకు, బంధువులతో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, భార్య అదృశ్యమైందని ఫిర్యాదు చేసే సమయంలో, పోలీసుల ప్రశ్నలకు తట్టుకోలేక తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు.

అనంతర పరిణామాలు: నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు రిమాండుకు తరలించారు. మూసీలో పడేసిన శరీర భాగాల కోసం డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్వాతి మొండానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడి స్వగ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, గ్రామ పెద్దల జోక్యంతో స్వాతి అంత్యక్రియలు ఆమె పుట్టింటివారే పూర్తిచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad