హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో 4వ తరగతి విద్యార్థిని అదృశ్యం కేసు విషాదాంతమైంది. గురువారం మిస్సైన విద్యార్థిని.. శుక్రవారం దమ్మాయిగూడ చెరువులో శవమై తేలింది. పాప మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. కాగా.. పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోస్టుమార్టమ్ కు పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రంతా చెరువు వద్ద వెతికినా కనిపించని మృతదేహం.. తెల్లవారాక ఎలా కనిపించిందని అనుమానిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థిని గురువారం నుంచి కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం 9 గంటలకు పాపను తండ్రి స్కూల్ వద్ద వదిలి వెళ్లగా.. మధ్యాహ్నం స్కూల్లో పాపలేదని యాజమాన్యం నుండి ఫోన్ వచ్చిందన్నారు. పాప బుక్స్, బ్యాగ్ క్లాసులోనే ఉన్నాయి కానీ పాప లేదని టీచర్ చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు.
స్కూల్ ఏరియాలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండడం కనిపించిందని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలతో పాప దమ్మాయిగూడ చెరువు వైపు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. గురువారం చెరువులో వెతికినా కనిపించని పాప.. శుక్రవారం కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఏదో దాస్తున్నారని, పాపపై అఘాయిత్యం జరిగి ఉంటుందని తల్లిదండ్రులు ఆరోపించారు. చెరువులో పడి పాప చనిపోతే శరీరం ఉబ్బి ఉండాలి కానీ.. అలా లేదని వాపోయారు. పాప డెడ్ బాడీని తమకు చూపించకుండానే తరలించడంతో తల్లిదండ్రులు, స్థానికులు దమ్మాయిగూడ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.