Mother abandons newborn baby over Instagram boyfriend obsession: నల్గొండ బస్టాండ్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రియుడి మోజులో పడి ఓ తల్లి తన 18 నెలల చిన్నారిని బస్టాండ్ లో వదిలేసి అక్కడి నుంచి పరారైపోయింది. తల్లి కనుమరుగవడంతో చిన్నారి బిగ్గరగా ఏడవటం మొదలు పెట్టాడు. ఇది గమనించిన బస్టాండ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ కు చెందిన ఓ వివాహితకు హాలియా కు చెందిన నరేష్ అనే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో, నరేష్‌ను కలిసేందుకు ఆమె తన 18 నెలల కొడుకుతో కలిసి ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి నల్గొండ బస్టాండ్‌కు వచ్చింది. బస్టాండ్‌కు చేరుకున్న తర్వాత, చిన్నారిని అక్కడే వదిలేసి, నరేష్‌తో కలిసి బైక్‌పై వెళ్లిపోయింది.
బాబును చేరదీసిన పోలీసులు
తల్లి కనిపించకపోవడంతో ఆ పసికందు బస్టాండ్‌లో బోరున ఏడ్చాడు. చిన్నారిని చూసిన ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని బాబును తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజీలో సదరు మహిళ నరేష్ తో కలిసి బైక్‌పై వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి.
నిందితుల అరెస్ట్, చిన్నారి అప్పగింత:
బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు ఫోన్ నంబర్ తెలుసుకుని, దాని ద్వారా మహిళతో పాటు నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పోలీసులు ఆ చిన్నారిని తల్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన సమాజంలో క్షీణిస్తున్న నైతిక విలువలకు అద్దం పడుతోంది. సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. కన్న బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


