Dowry death: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇస్నాపూర్‌లో వరకట్న వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. అదనపు కట్నం కోసం వేధింపులకు గురైన అశ్విని (24) అనే వివాహిత తన చిన్నారి కూతురు కళ్లెదుటే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఘటన వివరాలు:
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇస్నాపూర్‌లోని సుందరయ్య కాలనీలో నివసించే అశ్విని, తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది. పోలీసులు మరియు కుటుంబ సభ్యుల ప్రాథమిక విచారణలో అశ్విని భర్త, అత్తమామలు గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం ఆమెను తీవ్రంగా వేధిస్తున్నట్లు తేలింది. అశ్విని కి ఆమె తల్లిదండ్రులు వివాహ సమయం లో రూ. 12 లక్షలు కట్నంగా ఇచ్చేందుకు అంగీకరించి.. రూ. 11 లక్షలు, 18 తులాల బంగారం ఇచ్చారు. అయితే ఇటీవల అశ్వినీ తల్లిదండ్రులు వారి రెండో కూతురి వివాహానికై అశ్విని మామ దగ్గరినుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ అప్పుగా తీసుకున్న డబ్బుతో పాటు మిగిలిన భాకీ ఉన్న కట్నాన్ని కూడా ఇప్పుడు తీసుకు రావలసిందిగా అశ్వినిని వేదింపులకు గురి చేశారు. ఈ వేధింపులు రోజురోజుకూ అధికం కావడంతో అశ్విని తీవ్ర మనస్థాపానికి గురైంది.
గురువారం రాత్రి, అశ్విని తన కుమార్తె ఇంట్లోనే ఉండగా, ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆత్మహత్య చేసుకుంటుండగా చూసిన చిన్నారి భయంతో ఏడుస్తూ కేకలు వేసింది. చిన్నారి ఏడుపు విని చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, అశ్విని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల దర్యాప్తు, కేసు నమోదు:
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అశ్విని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు అశ్విని భర్త మరియు అత్తమామలపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ సంఘటన వరకట్న వేధింపుల సామాజిక రుగ్మతను మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు అండగా నిలబడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


