ఆర్టీసీ బస్సు సృష్టించిన బీభత్సానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరప్రమాదం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎంఎస్‌ఆర్‌టిసి కి చెందిన బస్సు వేగంగా వచ్చి.. సిగ్నల్ వద్ద ఆగిఉన్న ఏడు వాహనాలను ఢీ కొట్టింది. నాసిక్-పుణె హైవేపై పాల్సే గ్రామ సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. రెండు బస్సుల మధ్య రెండు బైక్ లు నలిగిపోవడంతో మంటలు చెలరేగాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
పూణె జిల్లాలోని రాజ్ గురునగర్ నుండి నాశిక్ కు ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సు వెళ్తోంది. పాల్సే గ్రామం సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో సిగ్నల్ వద్ద ఆగియున్న వాహనాలపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. నాలుగు బైక్ లు, రెండు ఎస్ యూవీలను ఢీ కొట్టి.. ఆ తర్వాత ముందున్న మరో బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య రెండు బైక్ లు చిక్కుకొని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఆ సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.