Stabbing In Birthday Party In Telangana: ఈ మధ్య కాలంలో హత్య చేయడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది. చిన్న చిన్న కారణాలకు చాలా మంది హత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చదువుతూ, వింటూ వస్తున్నాం. అయితే తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఒక పుట్టినరోజు వేడుక తీవ్ర హింసాత్మక సంఘటనకు దారి తీసింది. మామూలు గొడవ ప్రాణాంతక దాడికి మారింది. మద్యం సేవిస్తున్న సమయంలో “ఎంగిలి గ్లాసు”తో మద్యం ఇచ్చారని నానా వాదన పెట్టిన ఒక వ్యక్తి, ఇద్దరు స్నేహితులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది, దాడికి పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.
మంగళవారం వెల్ది గ్రామానికి చెందిన చెరుకు వెంకటేష్, మల్లా మధులు తమ పుట్టినరోజు సందర్భంగా మామిడి తోటలో స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కూరపాటి రాజశేఖర్ కూడా హాజరయ్యాడు. పార్టీ సమయంలో మద్యం సేవించుతూ, తన గ్లాసు ఎంగిలిదేమోనన్న అనుమానంతో చెరుకు వెంకటేష్, కీర్తి వెంకటేష్‌లతో రాజశేఖర్ వాగ్వాదానికి దిగాడు. ఈ తగాదా తర్వాత చెరుకు వెంకటేష్, కీర్తి వెంకటేష్‌లు రాజశేఖర్ తండ్రిని కలిసి ఫిర్యాదు చేశారు.
ALSO READ: https://teluguprabha.net/crime-news/lucknow-revenge-murder-10-years/
ఈ ఫిర్యాదుతో మండిపడ్డ రాజశేఖర్, తనపై నేరుగా ఫిర్యాదు చేసినందుకు కోపంతో ఇంటికెళ్లిన వెంటనే కత్తి తీసుకొని వారిపై దాడికి పాల్పడ్డాడు. మొదట చెరుకు వెంకటేష్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి, అడ్డుకునేందుకు వచ్చిన కీర్తి వెంకటేష్‌కు గాయాలు కలిగించాడు. అక్కడ ఉన్న వారు రాజశేఖర్‌ను అదుపు చేసినా ఆగలేదు. దాడి తరువాత అతడు తర్వాత ఘటన స్థలాన్ని విడిచిపెట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన చెరుకు వెంకటేష్‌ను హుటాహుటిన హైదరాబాద్‌కి తరలించి శ్రీకర ఆస్పత్రిలో చేర్పించారు. కీర్తి వెంకటేష్‌కు జనగామ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందింది. ప్రస్తుతం చెరుకు వెంకటేష్ ఆరోగ్యం మెరుగవుతోందని తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ సంఘటన గ్రామంలో కలకలం సృష్టించింది.


