Nagamani Murder | కులాంతరం వివాహం చేసుకున్న కారణంగా లేడీ కానిస్టేబుల్ నాగమణి సోదరుడి చేతిలోనే హతమవడం తెలంగాణలో సంచలనం రేపింది. సోమవారం ఉదయం జరిగిన ఈ హత్యోదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాగమణి హత్యపై ఆమె భర్త శ్రీకాంత్ స్పందించారు. తమ పెళ్లిని వ్యతిరేకించిన నాగమణి తల్లిదండ్రులు అనుకున్నంత పని చేశారని అతను బోరున విలపించాడు.
శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ… వారిది ఎనిమిదేళ్ల ప్రేమ అని వివరించాడు. తమ ప్రేమ విషయం తెలిసి నాగమణి కుటుంబసభ్యులు ఆమెని దూరం పెట్టినట్టు తెలిపాడు. దీంతో తానే నాగమణిని హాస్టల్ లో ఉంచి చదివించానని, అలా నాలుగేళ్లు గడిచాక 2021 లో ఆమెకి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. ఎప్పుడైతే పోలీస్ ఉద్యోగం వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ నాగమణికి ఆమె కుటుంబసభ్యులు దగ్గరవడం మొదలుపెట్టారని వివరించాడు.
కానిస్టేబుల్ నాగమణి (Constable Nagamani) తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నవంబర్ 10న యాదగిరిగుట్టలో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు శ్రీకాంత్ వెల్లడించాడు. అయితే, పెళ్ళైన వెంటనే పోలీస్ స్టేషన్ లో తమకి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశామని తెలిపాడు. “మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాగమణి ఫ్యామిలీ మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. ఊహించినట్టే ఈరోజు ఉదయం నా భార్యని వాళ్ళ తమ్ముడు పరమేష్ హత్య (Murder) చేశాడు. ఉదయం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళేటప్పుడు నాగమణి నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అని చెప్పింది. అంతలోనే ఫోన్ కట్ అయింది. వెంటనే మా అన్నయ్యకి విషయం చెప్పాను. కానీ మా అన్నయ్య వెళ్ళేసరికే నాగమణి రక్తపు మడుగులో కొట్టుకుని చనిపోయింది” అని శ్రీకాంత్ వాపోయాడు.