ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి మరణించారు. యాక్సిడెంట్లో గాయాలు పాలైన నీరజ రెడ్డి కోలుకోలేక ప్రాణాలు విడిచారు. ఆలూరు బిజెపి ఇన్చార్జిగా నీరజ రెడ్డి పనిచేస్తున్నారు. హైదరాబాద్ హైవే ఇట్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలై కన్నుమూశారు.
తెలంగాణ రాష్ట్రం బీచుపల్లి వద్ద ఆమె వెళ్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తీవ్ర గాయాలైన ఆమెను కర్నూల్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చేర్పించిన ఫలితం లేకపోయింది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలలో ఆ కుటుంబానికి అనుచర వర్గం బాగా ఉంది. ఆమె భర్త పత్తికొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 1989లో తెలుగుదేశం అభ్యర్థి ఉచ్చరప్పపై గెలుపొందాడు. అనంతరం 1994లో ఏప్రిల్ 18న గోనెగండ్ల దగ్గర రైస్ మిల్లులో ఉన్న ఆయనపై ప్రత్యర్థులు దాడి చేసి ఆయనతోపాటు కోడుమూరుకు చెందిన పరప్ప నాయుడును హత్య చేశారు. దీంతో భర్త వర్ధంతి మరో రెండు రోజుల్లో ఉండడంతో హైదరాబాద్ నుంచి వారి గ్రామమైన తెర్నకల్లుకు బయలుదేరినట్టు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో తన ప్రయాణిస్తున్న కారు బీచుపల్లి వద్ద టైరు పలికి పలిటీలు కొట్టడంతో ఆమె మృతి వాత పడింది. భర్త హత్య తర్వాత వారి వర్గం ఆమెతో పాటే ఉండిపోయింది. దీంతో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీటు ఆశించి రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి అప్పటి తెదేపా అభ్యర్థి అయిన ఎస్వి సుబ్బారెడ్డికి గట్టి పోటీ ఇచ్చి తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందింది. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఆలూరులో జరిగిన బహిరంగ సభలో నీరజారెడ్డి కుమార్తె ఇచ్చిన స్పీచ్ అందరిని కంటతడి పెట్టి ఒక్కసారిగా ఎన్నికల్లో సెంటిమెంటును తీసుకొచ్చింది. ఆ విధంగా అప్పటి ఎన్నికల్లో గెలిచి 2011 వరకు ఎమ్మెల్యేగా కొనసాగి పార్టీలో వచ్చిన అంతర్గత విభేదాలతో పదవికి రాజీనామా చేసింది. అనంతరం కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2019 ఎన్నికల ముందు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరి పార్టీ గెలుపుకు కృషి చేసింది. అయితే ఎవరు ఊహించని విధంగా గత సంవత్సరం బిజెపి పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు ఆధ్వర్యంలో కండువా కప్పుకొని ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పింది. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఈమె మృతి చెందడం ఒక్కసారిగా బిజెపికి షాక్ తగిలినట్టు అయింది. ఆమె స్వగ్రామం తెర్నేకల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.