ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కేసులు నగరవాసులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. హై ఎండ్ రెస్టారెంట్లో తిన్నా కూడా ఏదో ఒక అనారోగ్యానికి గురవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రముఖ ఆహార విక్రయ సంస్థలు సైతం పాచిపోయిన ఆహారానికి రంగులు అద్ది, మసాలాలు దంచికొట్టి వడ్డిస్తున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల్లో కల్తీ పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆహార భద్రతాధికారులు రంగంలోకి దిగి తనిఖీలను మొదలుపెట్టారు. బడా రెస్టారెంట్లలో సైతం కనీస ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదనే విషయాలు వారి తనిఖీల్లో బయటపడుతున్నాయి. అందుకు మాల్స్ లోని ఆహార పదార్థ విక్రయ కేంద్రాలు సైతం ఏమి మినహాయింపు కాదనే విషయం తేటతెల్లం అవుతోంది.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు…
ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా ఆహార పదార్థ విక్రయ కేంద్రాలు, పండ్ల విక్రయాలు జరుగుతున్నాయా లేదా అని టాస్క్ ఫోర్స్ టీంలు తనిఖీలు చేపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆహార నిల్వ, నూనెల పునర్వినియోగం, పరిశుభ్రత, నీటి నాణ్యత, తయారీకి అవలంబిస్తున్న విధానాలు వంటి వివిధ అంశాలను ఆహార భద్రతాధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. అంతేకాకుండా క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే నోటీసులను జారీ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంటే కేసులను సైతం నమోదు చేయడానికి వెనుకాడబోమని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. అందుకు చిన్నా, పెద్ద అనే భేదాలు ఉండవని అధికారులు చెబుతున్నారు.
బంజారాహిల్స్ జీవీకె వన్ మాల్ లో…
ఇటీవల ఆహార భద్రతాధికారులు బంజారాహిల్స్ లోని జీవీకె వన్ మాల్ లో తనిఖీలు నిర్వహించారు. అందులోని ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జోయ్,ఖాన్ సాబ్ వంటి ఫుడ్ కోర్టులు పరిశుభ్రత, ఆహార నిల్వ, ఆహార నాణ్యత ప్రమాణాల్లో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. కెఎఫ్సీ రెస్టారెంట్లో నూనె పునర్వినియోగంపై సరైన లెక్కలను నిర్వహించడం లేదని గమనించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్ధంగా హార్డ్ రాక్ కేఫ్, స్టార్ బక్స్ కాఫీ రెస్టారెంట్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో సదరు ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకులకు సంబంధిత అంశాలపై నోటీసులు జారీ చేశారు.
శరత్ సిటీ మాల్ లో..
శరత్ సిటీ మాల్ లోని రెస్టారెంట్లలో ఆహార భద్రతాధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించగా పలు ఫుడ్ సేప్టీ నిబంధనల ఉల్లంఘన బయటపడింది. అందులోని ఫైర్ ఫ్లై రెస్టారెంట్ నిర్వాహకులు సరైన పరిశుభ్రత పాటించడం లేదని, పురుగుపుట్ర నియంత్రణలో లోపాలున్నాయని, అంతేకాకుండా బీఐఎస్ లైసెన్స్ లేని తయారీదారు నుంచి కొనుగోలు చేసిన త్రాగునీటి బాటిల్స్ వాడుతున్నట్లు వారి తనిఖీల్లో బయటపడింది. ఏయిర్ లైవ్ రెస్టారెంట్ నిర్వాహకులు విక్రయిస్తున్న వాటర్ బాటిళ్లలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం కంటే తక్కువ టీడీఎస్ ఉన్న నీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. టాకో బెల్ నిర్వాహకులు నూనె పునర్వినియోగంపై రికార్డులు సరిగ్గా నిర్వహించకపోవడమే కాకుండా, వారాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పునర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించి షోకాజ్ నోటీసులు అందించారు. బాయిలర్ రూం క్లబ్ నిర్వాహకులు ఆహార నిల్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది.
పెద్ద పెద్ద కాఫీ హౌజుల్లో కూడా…
బంజారాహిల్స్ లోని పెద్ద పెద్ద కాఫీ హౌజుల్లో సైతం లోపాలు బయటపడుతున్నట్లు ఆహార భద్రతాధికారుల తనిఖీల్లో బయటపడుతోంది. ఇటీవల బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని రోస్టరీ కాఫీ హౌజ్ లో అధికారులు తనిఖీలు నిర్వహించగా పరిశుభ్రతకు సంబంధించిన లోపాలు కనిపించాయి. దీంతో వెంటనే మెరుగుపరచాలని, భవిష్యత్తులో లోపాలు ఉండొద్దని సూచిస్తూ నోటీసును జారీ చేశారు. అదే విధంగా రోస్ట్ సీసీఎక్స్ లో అసలు ఎటువంటి పోషకాలు లేని పాలతో పాటు తప్పుడు బ్రాండెడ్ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు అధికారులు తేల్చారు. దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నగరంలోని ఆహార పదార్థాల విక్రేతలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిదేనని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఆహార భద్రతాధికారులు స్పష్టం చేస్తున్నారు.