అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో పోలీసులు ఓ వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో సర్ధిచెప్పాల్సిన పోలీసులు భర్తను చితకబాదేశారు. ఆ వ్యక్తి ఒంటి నిండా గాయాలు కావటంతో మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే. ఆ గొడవలను సామరస్యంగా పరిష్కారించుకోవాల్సింది పోయి పోలీసులను ఆశ్రయించారు ఈ భార్యభర్తలు. అది కూడా డైరక్టుగా పోలీసు స్టేషనుకి వెళ్లి ఫిర్యాదు చేయకుండా 100 కి డయల్ చేయటంతో రంగంలోకి దిగారు పోలీసులు. పుల్లంపేటకు చెందిన మాధురి, శివప్రసాద్ భార్యభర్తలు. వీరిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలీదు. అయితే భార్య మాధురి 100 కి కాల్ చేసి చెప్పటంతో పోలీసులు వచ్చారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-6.18.12-PM.jpeg)
భార్యా భర్తల మధ్య గొడవను సర్ది చెప్పాల్సిన పోలీసులు లాఠీ విరిగే దాకా భర్త శివప్రసాద్ ను చితకబాదినట్లు బాధితుడు బొమ్మ తొట్టి శివప్రసాద్ ఆరోపిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పాడు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-6.18.49-PM.jpeg)
లాఠీ విరగడంతో డ్రిప్పు పైపుతో ఇష్టారాజ్యంగా పోలీసులు దాడి చేశారని చెప్పాడు. ఒళ్లంతా కందిపోయి రక్త గాయాలతో మీడియా ముందు బాధితుడు శివప్రసాద్ కన్నీటి పర్యంతయ్యారు. తనకు ఆపరేషన్ జరిగిందని ముఖంలో ప్లేట్లు, కాళ్లలో రాడ్లు వేసారని కాళ్లు పట్టి బతిమిలాడుకున్నా వదలకుండా ముఖంపై బూటు కాలుతో పోలీసులు తన్నారని బాధితుడు ఆవేదన వ్యకం చేశారు. తనపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ శివప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు.